ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ భారత్‌ లోనూ వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్‌ కు సంబంధించి రెండో కేసు నమోదైంది. జనవరి 24న చైనా నుండి ఇండియాకు వచ్చిన ఒక వ్యక్తిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ సోకిన వ్యక్తి ఇటీవల చైనాలో పర్యటించినట్లు డాక్టర్లు గుర్తించారు.

 

అయితే.. భారత్ లో ఈ కేసుతో మొత్తం రెండు కేసులు నమోదయ్యాయి.  మొదటిది కూడా కేరళలోనే నమోదైంది. మూడు రోజుల కిందట వుహాన్ నుంచి కేరళ వచ్చిన మెడిసిన్ విద్యార్థికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. అది మొదటి కేసుగా నమోదైంది.  జ్వరం, దగ్గు లేదా శ్వాస ఇబ్బంది సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక ఆస్పత్రిలో రిపోర్టు చేయవలసిందిగా కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. అంతేకాకుండా.. జనవరి 1 తర్వాత చైనా నుంచి వచ్చిన వారు ఆరోగ్య శాఖ వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరింది.

 

ఇప్పటికే కరోనా వైరస్ వల్ల చైనాలో 304 మందికి పైగా మరణించారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఇంకా 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 45 మంది చనిపోగా.. కొత్తగా మరో 2,590 మంది కరోనా బారిన పడినట్టు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. మొత్తం 14,380 కరోనా వైరస్ కేసులు నమోదుకావడంతో 2003లో సార్స్ వైరస్ సోకినవారి కంటే ఇది అధికం. 


హుబే ప్రావిన్సుల్లోని హౌవున్‌ గాగ్‌ లో కరోనా వైరస్‌ ను నియంత్రించే చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని చైనా అధికార పత్రిక తెలిపింది. రోగులకు అవసరమైన ఔషధాలు, మెడికల్ మాస్క్‌ లు అందుబాటులో లేవని ఆ నగర మేయర్ ప్రకటించారు. కాగా., ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి మొత్తం చైనా దేశానికి వ్యాపించింది. ఇలా వ్యాప్తి చెందుతూ.. ప్రపంచదేశాలకు వ్యాప్తి చెందుతుంది. అయితే.. ఇప్పటివరకు ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: