తెలంగాణలోనే కాదు.. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ఇంకా ప్రారంభం కాక ముందే.. భక్తుల జోరు సాగుతోంది. వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు మేడారానికి పోటెత్తుతుండటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. మేడారం రహదారులు, జంపన్నవాగు, అమ్మవార్ల గద్దెల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది.

 

 

అయితే మేడారం జాతరకు వచ్చే వారికి సరైన సౌకర్యాలు అందించడంలో అధికారులు విఫలం అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు బెల్లం సమర్పించడం సంప్రదాయం. కానీ బెల్లం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో కిలో ధర రూ.40-45 మధ్య ఉంటే. ఇక్కడ రూ.80-100 వరకు అమ్ముతున్నారు. నిలువెత్తు బంగారం కొనుగోలు చేసే వారు అదనంగా రూ.2 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. తాగునీటి వసతి కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది.

 

 

వాగు నుంచి ఆలయం ఒకటిన్నర కిలోమీటరు దూరం ఉంటుంది. మార్గమధ్యలో ఎక్కడా తాగునీటి జాడ కన్పించడం లేదు. క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసిన నల్లాల్లో తాగునీరు సరఫరా కావడం లేదు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు, దుకాణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. వినియోగదారులకు 20 లీటర్ల క్యాను రూ.50-60, లీటరు సీసాను రూ.30-40 చొప్పున విక్రయిస్తున్నారు.

 

ఇక రెండు కొబ్బరికాయల ధర రూ.60-80 వరకు ఉందని, ధరల నియంత్రణలో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికే నెల రోజులుగా భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. నాలుగైదు రోజుల నుంచి ఈ తాకిడి చాలా ఎక్కువగా ఉంది. రద్దీ తారస్థాయికి చేరింది. మేడారంలో వారం రోజులుగా కనీసం రోజుకు లక్ష నుంచి రెండు లక్షలకు పైగానే భక్తులు వస్తున్నారు. ఆది, బుధ వారాల్లో ఈ సంఖ్య 3 లక్షలకుపైగా ఉంటోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: