రెడ్‌క్రాస్‌లో ఎన్నికలు జరుగుతాయని ఎవరికైనా తెలుసా..? అంటే తెలియదనే సమాధానమే వస్తుంది. కానీ నెల్లూరులో మాత్రం అలా కాదు. స్థానిక సంస్థల పోరును మించి అక్కడి రెడ్‌క్రాస్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో 15 స్థానాల కోసం 46 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 

 

సింహపూరి గడ్డపై రెడ్‌క్రాస్ సొసైటీలో ఎన్నికల వేడి రాజుకుంది. మొత్తం 12 విభాగాలతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోనే ఉంది రెడ్‌క్రాస్‌. 10 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉన్న రెడ్ క్రాస్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందంటే అది నెల్లూరులోనిదే. దీనికి తోడు దక్షిణ భారతదేశ సభర్మతిగా పిలుచుకునే పల్లెపాడులోని గాంధీ ఆశ్రమం కూడా దీని ఆద్వర్యంలోనే నడుస్తోంది. అంతటి ఘన చరిత్ర ఉన్న సంస్థ పాలనలో ఆధిపత్యం కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. 

 

రెడ్‌క్రాస్‌ సొసైటీ పాలక మండలి కాలపరిమితి మూడేళ్లు. అయితే, ప్రస్తుత కమిటీ కాలపరిమితి ఏడాది క్రితమే పూర్తైనా.. ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. ప్రస్తుత కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపడంతో ఎట్టకేలకు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్ లభించింది. 15 మంది సభ్యులను కమిటీ కోసం ఎన్నుకోవలసి ఉండగా.. అందుకోసం 46 మంది పోటీ చేశారు.

 

మూడు ప్యానళ్లు ఎన్నికల్లో పోటీ పడుతుండగా.. రెండు ప్యానళ్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 5,174 మంది సభ్యులున్న సంస్థలో 4,834 మందికి ఓటు వేసే అవకాశం దక్కింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం వరకు జరగనున్నాయి. వెంటనే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రేపు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లను ఎన్నుకుంటారు.

 

మొత్తానికి సింహపురి గడ్డ నెల్లూరులో రెడ్ క్రాస్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టు అభ్యర్థులు పోటీపడుతున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఎవరు పై చేయి సాధిస్తారో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: