రాష్ట్రంలో సీఎం జగన్ పాలన నచ్చే పవన్​ కల్యాన్ సినిమాల్లో నటంచడానికి సిద్ధమయ్యారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఏపీలో బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తే తాను తిరిగి సినిమాల్లో నటిస్తానని పవన్​ కల్యాణ్ గతంలో ప్రకటించారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో సుపరిపాలన అందుతున్నందునే పవన్​ సినిమాల్లోకి వెళ్తున్నాడని తెలిపారు. పవన్ బీజేపీతో కలిసి పనిచేస్తున్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులపై బీజేపీని అడగాలని సూచించారు. నిధులు తేలేదని ఇక నుంచి  సీఎం జగన్‌ను మాత్రం విమర్శించొద్దని ఆయన పవన్​కు  సూచించారు.


అదే సందర్భంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి కొడాలి నాని విరుచుకుపడ్డారు. దివాకర్​ రెడ్డికి వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఆయన జీవితమంతా భజన చేయడమే సరిపోయిందని విమర్శించారు.  40 ఏళ్ల నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి జై కొట్టడం అలవాటైపోయిందని చెప్పారు. 500 ఎకరాల సున్నపురాయి క్వారీ కోసం చంద్రబాబు బూట్లు నాకారని విమర్శించారు. బస్సులకు పర్మిట్లు కట్టకుండా, పన్ను కట్టకుండా తిప్పుతున్న ఘనుడు జేసీ అని మండిపడ్డారు.

సీఎం జగన్​ గురించి మాట్లాడేటప్పుడు జేసీ దివాకర్​ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. జగన్ విమర్శించే స్థాయి జేసీకి లేదన్నారు.బస్సు ప్రమాదంలో 50 మందిని బలి తీసుకున్న జేసీ.. జగన్‌ను వైరస్ అంటున్నారు. అవును జగన్ దుర్మార్గులు, దుష్టులకు వైరస్ అని చెప్పారు. జగన్​ జోలికి వచ్చే వైరస్ షాక్​ తగిలి కోలుకోలేవని తెలిపారు. మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడిని  కొత్త బిచ్చగాడితో పోల్చారు.    కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు.. చంద్రబాబు రోజుకో సమస్యతో ముందుకొస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో  కొత్త ఇసుకవిధానంతో ప్రభుత్వానికి ఏడాదికి వెయ్యి కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక అని 5 వేల కోట్లు మెక్కారని గుర్తుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: