మూడు రాజధానుల వల్ల కృష్ణాలో వైసీపీకి పట్టు తగ్గిందా? అమరావతికి జై కొట్టడం వల్ల టీడీపీకి మైలేజ్ పెరిగిందా? అంటే టీడీపీ శ్రేణుల నుంచి అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. అయితే వారి మధ్యలో నడుస్తున్న చర్చల ప్రకారం చూసుకుంటే...కృష్ణాలో ఎన్నికలప్పుడు ఉన్న పరిస్తితి ఇప్పుడు లేదంటున్నారు. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ 2, వైసీపీ 14 స్థానాలు గెలుచుకుంది. అటు 2 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి టీడీపీ, మరొకటి వైసీపీ గెలుచుకుంది.

 

ఇక ఇటీవల గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీని వదిలేసి, వైసీపీకి మద్ధతు తెలిపారు. దీని బట్టి చూసుకుంటే టీడీపీకి ఒక్కరే మిగిలారు. అయితే ఎప్పుడైతే మూడు రాజధానులు తెరపైకి వచ్చాయో అప్పటి నుంచి పరిస్తితులు మారిపోయాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. జిల్లాలోని మెజారిటీ ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని అంటున్నారు. అలాగే ఈ అమరావతినే పలు నియోజకవర్గాలని ప్రభావితం చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. అలా చూసుకుంటే అమరావతికి దగ్గరగా ఉన్న విజయవాడ సిటీలోని 3 నియోజకవర్గాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయని టీడీపీ అంతర్గత చర్చల్లో టాక్ నడుస్తుంది.

 

అదేవిధంగా అటు అమరావతికి ఇటు పక్కన ఉన్న నందిగామ, జగ్గయ్యపేటల్లో కూడా అమరావతి కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఇక విజయవాడకు దగ్గరగా ఉన్న మైలవరం, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాలు ఫేవర్‌గానే ఉన్నట్లు సమాచారం. ఇటు వస్తే అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో కాస్త అటు ఇటూగా ఉన్నట్లు తెలిసింది. అలాగే నూజివీడు, తిరువూరు, కైకలూరుల్లో కాస్త అమరావతి ప్రభావం ఉన్నట్లు టీడీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ అమరావతి ఎఫెక్ట్ టీడీపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: