టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ శంషాబాద్ వరకు మెట్రో రైలును పొడిగిస్తామని చెప్పారు. శంషాబాద్ కు విమానశ్రయం వలన అంతర్జాతీయంగా కూడా పేరు వచ్చిందని అభివృద్ధిలో కూడా శంషాబాద్ కు అదే రకమైన గుర్తింపు తీసుకొనిరావాలని తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. 
 
నిన్న కేటీఆర్ సమక్షంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ గణేష్ గుప్తా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8మంది సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శంషాబాద్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపరచటం కొరకు కృషి చేస్తోందని అన్నారు. 
 
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని మున్సిపల్ ఎన్నికలలో, జిల్లా పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓటమి చవిచూశాయని అయినా ఆ పార్టీల తీరు మాత్రం ఏమీ మారలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో గణేష్ గుప్తాలాంటి నాయకులు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. 
 
శంషాబాద్ వరకు మెట్రో రైలు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హైదరాబాద్ వాసులకు శుభవార్త అనే చెప్పవచ్చు. శంషాబాద్ వరకు మెట్రో రైలును పొడిగిస్తే సిటీలో చాలావరకు ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. శంషాబాద్ వరకు మెట్రో పొడిగించాలనే హైదరాబాద్ వాసుల కల త్వరలోనే తీరనుంది. కేటీఆర్ హామీ ఇవ్వడంతో త్వరలో ఈ దిశగా అడుగులు పడనున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో శంషాబాద్ వరకు మెట్రో దిశగా పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. శంషాబాద్ వరకు మెట్రో పొడిగిస్తామని కేటీఆర్ చెప్పటం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: