బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించే క్రమంలో సోమవారం సాయంత్రం నుంచి వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. రూ. 80 కోట్లతో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇది. ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రవేశం కల్పిస్తున్నారు దశాబ్దంన్నర తరువాత ఫలిస్తున్న స్వప్నం. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. ఏళ్ల తరబడి చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్‌కు చెక్‌ పెడుతూ, దశాబ్దంన్నరగా ఊరిస్తున్న కలను సాకారం చేస్తూ మన ముందుకొచ్చి వాలింది. అధికారిక ప్రారంభోత్సవం ప్రస్తుతానికి లేకపోయినా.. ట్రయల్‌ రన్‌తో వాహనాల రాకపోకలకు జెండా ఊపనున్నారు.


బెంజ్‌సర్కిల్‌ మొదటి వరుస పనుల కాంట్రాక్టును దక్కించుకున్న దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థకు 2016, నవంబరులో ఎన్‌హెచ్‌ అధికారులు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సర్వీసు రోడ్డు వెంబడి చెట్లను తొలగించాల్సి రావటం, డిజైన్‌ మార్పు వల్ల మళ్లీ అలైన్‌మెంట్‌ను నిర్దేశించాల్సి రావటం వల్ల పనుల ప్రారంభానికి 8 నెలల సమయం పట్టింది, 2017, జూలైలో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ పనులు ప్రారంభించింది। కిందటి నవంబరులో ఫ్లై ఓవర్‌ను అప్పగించాల్సి ఉండగా, ఒక్క అప్రోచ్‌ తప్ప ఫ్లై ఓవర్‌ను సిద్ధం చేసింది. ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ దగ్గర వెంట్‌ ఏర్పాటు చేయాలన్న వివాదంతో చాలాకాలం పనులు ఆగిపోయాయి. లేకపోతే నిర్ణీత సమయంలోనే పనులు పూర్తయ్యేవి. 


బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ సోమవారం అనధికారికంగా ప్రారంభంకానుంది. ట్రయల్‌ రన్‌ అయినప్పటికీ సోమవారం సాయంకాలం నుంచి ఫ్లై ఓవర్‌పై నిరవధికంగా వాహనాలు నడపనున్నారు. తొలుత ఎన్‌హెచ్‌ పీడీ ఏ. విద్యాసాగర్‌, పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం కలెక్టర్‌ ఇంతియాజ్‌కు ఫ్లై ఓవర్‌ గురించి వివరిస్తారు. సాయంత్రం 5 గంటల తర్వాత విద్యుత్‌ లైట్ల వెలుగు జిలుగుల మధ్య ఫ్లై ఓవర్‌పై ట్రయల్‌ రన్‌ను నిర్వహిస్తారు. కోల్‌కతావైపు నుంచి చెన్నైకు వెళ్లే వాహనాలను అంటే.. ఏలూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. రెండువైపులా ట్రాఫిక్‌ను వదలాలన్న అంశం కూడా పరిశీలనలో ఉంది. దీనిపై కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌తో భేటీ తర్వాత నిర ్ణయం తీసుకుంటారు.


ఏళ్ల నాటి కల
బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ రూపుదిద్దుకోవటానికి దశాబ్దంన్నరపైనే పట్టింది. విజయవాడ - మచిలీపట్నం నాలుగు వరుసల రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో ఇది అంతర్భాగం. రూ.400 కోట్లతో దశాబ్దం కిందట బీవోటీ ప్రాతిపదికన ఎన్‌హెచ్‌ ఈ ఉమ్మడి ప్రాజెక్టుకు టెండర్లు పిలిచింది. అప్పట్లో కాంట్రాక్టు సంస్థలు ముందుకొచ్చినా ఈ ప్రాజెక్టును చేపట్టలేకపోయాయి. అరదశాబ్దం ఇలాగే గడిచిపోయింది. ఆ తర్వాత ప్రజల డిమాండ్‌ మేరకు ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారు. ఈసారి అంచనా వ్యయం రూ. 700 కోట్ల వరకు పెరిగింది. భూ సేకరణతో కలిపి రూ.1,000 కోట్లు దాటింది.

ఈపీసీ విధానంలో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ టెండర్లు దక్కించుకుంద. విజయవాడ - మచిలీపట్నం నాలుగు వరుసల రోడ్డులో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ అంతర్భాగం. దీని విలువ రూ. 80 కోట్లు జాతీయ రహదారి 16పై 760 మీటర్లుగా నిర్మించాలని నిర్ణయించారు. దీని ఆధారంగా నిర్మల జంక్షన్‌ వరకే వంతెన నిర్మించాలనుకున్నారు. ఎంపీ కేశినేని నాని చొరవతో ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారులను రప్పించి క్షేత్రస్థాయిలో చూపించి ఫ్లై ఓవర్‌ను 1,470 మీటర్లకు పొడిగించారు.

ఆరు వరుసల్లో సింగిల్‌గా సెంట్రల్‌ డివైడర్‌పై నిర్మించాల్సిన ఫ్లై ఓవర్‌ను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వరుసలుగా నిర్మించేందుకు డిజైన్లు చేయించారు. ఐకానిక్‌గా నిర్మించేందుకు కేంద్ర సహాయాన్ని కోరారు. ఇందుకు కేంద్రం అంగీకరించకపోయినా రెండు వరుసలకు ఓకే చెప్పింది. మొదటి వరుస టెండర్లను 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పిలిచింది. 


సర్వీసు రోడ్డు లేకుండానే..
బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను అనధికారికంగా ప్రారంభిస్తున్నారన్న ఆనందం ఒకవైపు ఉంటే.. సర్వీస్‌ రోడ్డును విస్తరించకుండానే జరుగుతోందన్న ఆందోళన మరోవైపు నెలకొంది. ఈ ఫ్లై ఓవర్‌ను రెండు వరుసలుగా మార్చటం వల్ల సర్వీస్‌ రోడ్డు వెంబడి అప్రోచ్‌ల దగ్గర భూమిని సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో ఖరీదైన భూములు కలిగిన బెంజ్‌సర్కిల్‌ దగ్గర భూ యజమానులను ఒప్పించటం చాలా కష్టం. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ పీడీ విద్యాసాగర్‌ స్వయంగా రంగంలోకి దిగి భూ యజమానులతో చర్చలు జరిపి వారి అంగీకారాన్ని పొందారు.

మొత్తం 27 మంది భూ యజమానులు అంగీకార పత్రాలు ఇచ్చారు. వీరికి రూ.30 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. దీంతో సర్వీస్‌ రోడ్డును విస్తరించే అవకాశం లేకుండాపోయింది. ముందుకొచ్చిన యజమానుల స్థలాలు అప్రోచ్‌లతో దిగ్బంధమయ్యాయి. దారి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సర్వీసు రోడ్డును విస్తరించాల్సిందేనని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కోర్టు నుంచి ఇంకా తీర్పు రావాల్సి ఉంది. ఈలోపు కేంద్రం కనికరిస్తే అధికారికంగా ప్రారంభోత్సవం చేసుకునే సమయానికైనా సర్వీసు రోడ్డును విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: