వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు సుప్ర‌సిద్ధుడు అయిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత‌కుమార్ హెగ్డే మ‌రోమారు క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ కులం గురించి కేంద్ర‌ మంత్రి హోదాలో ఉన్న‌ అనంత్ కుమార్ హెగ్డే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీ సంక‌ర జాతి సంతానం అన్నారు. ముస్లిం తండ్రి, క్రైస్త‌వ త‌ల్లికి రాహుల్ జ‌న్మించాడ‌ని విమ‌ర్శించారు. బ్రాహ్మ‌ణుడిని అని చెప్పుకుంటున్న రాహుల్‌.. త‌గిన ఆధారాలు ఇస్తాడా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాజాగా ఇప్పుడు జాతిపిత మ‌హాత్మ‌గాంధీపై అంత‌కుమించిన క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు.

 


గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అనంత‌కుమార్ హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వారితో కుమ్మ‌క్కై సత్యాగ్రహం చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారని ఆరోపించారు. `స్వాతంత్య్ర పోరాటంలో మూడు వర్గాలు ఉండేవి. ఒకరు విప్లవకారులు, మరొకరు ఆయుధాలు పట్టుకున్నవారు, మరో వర్గం ప్రముఖ జాతీయవాదులు. ఎవరు దేశం కోసం ఆయుధాలు పట్టుకుని పోరాటం చేశారో వారందరూ ఉరికి వేలాడారు. తమ సిద్ధాంతాలు, వాదనలతో దేశ నిర్మాణం కోసం ప్రయత్నించారో వారందరూ చీకటి గదుల్లో మగ్గిపోయారు. బ్రిటీషు వారితో ఒప్పందం కుదుర్చుకుని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని సర్టిఫికెట్‌ తీసుకున్నారో వారందరూ నేటి చరిత్ర పుటల్లో విరాజిల్లుతున్నారు`  అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

బ్రిటిష్ వారి ఫ్రస్టేషన్ కారణంగానే బ్రిటిషర్లు భారత్ కు స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పుకొచ్చిన హెగ్డే చరిత్ర చదివినప్పుడు గాంధీని మహాత్మాడిగా పోల్చడం కనిపిస్తే నాకు రక్తం మరిగిపోతుంది అని అన్నారు. `గాంధీ చేపట్టిన సత్యాగ్రహం వల్లే స్వాతంత్య్రం వచ్చిందని కాంగ్రెస్ మద్దతు దారులు చెబుతున్నారు. కానీ అది నిజం కాదు. సత్యాగ్రహం వల్ల బ్రిటిషర్లు దేశాన్ని వీడలేదు. వారి ఫ్ర‌స్టేష‌న్ ద్వారా అలా చేసేశారు.`` అంటూ తెలిపారు.  గాంధీజీ పేరు ఎత్త‌కుండా... ఇలాంటి వ్యక్తి దేశానికి మహా పురుషుడా..? అని హెగ్డే ప్ర‌శ్నించారు. దేశం చేసుకున్న దౌర్భాగ్యం ఇదంతా  అంటూ గాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: