ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దక్షిణ భారతదేశంలో మరో కీలక నేతకు సేవలందించనున్నారు. తమిళనాట త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్‌కు ఎన్నికల వ్యూహాలపై సలహాలివ్వనుంది పీకే టీమ్. పార్టీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్న మీమ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి సిద్ధమైంది ప్రశాంత్ కిషోర్ ఆఫీస్‌.

 

లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు నెగ్గిన డీఎంకేకు తమిళనాట ఎదురేలేని పరిస్థితి. అయినా, రజినీకాంత్ ఎంట్రీతో పాటు ఇతరుల వల్ల తన విజయయాత్రకు ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలని చూస్తున్నారు స్టాలిన్. అందుకే, ప్రస్తుతం దేశంలో సక్సెస్‌ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిశోర్‌ను తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు.

 

డీఎంకే తరఫున ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి పీకే టీమ్‌తో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. 15 నెలలకు ఈ ఒప్పందం కుదిరింది. అయితే, అన్ని రాజకీయ పార్టీలతో ప్రశాంత్‌ కిశోర్‌ ఒప్పందం కుదుర్చుకోరని, గెలుపు అవకాశాలు ఉన్న పార్టీలతో మాత్రమే చేతులు కలుపుతారనే ప్రచారముంది. గతంలో నరేంద్రమోడీ, నితీశ్‌కుమార్‌, మమతా బెనర్జీ, జగన్‌మోహన్‌రెడ్డి, ఉద్ధవ్‌ ఠాక్రేలకు సలహాలు ఇచ్ఛి.. తన వ్యూహాలతో ఆయా పార్టీలు విజయం సాధించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటున్న డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయట.

 

డీఎంకే అధ్యక్షుడు స్టాలీన్ ఎన్నికల ప్రసంగంలో సామెతలు, ఊత పదాలు ఎక్కువగా వాడుతుంటారు. సామెతలను వాడేటప్పుడు పలుమార్లు వాటి అర్థాలు మార్చేసి, వాక్యాలు మార్చి పలికిన సందర్భాలు ఉన్నాయి. వీటిని రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలుగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ చేశారు. ప్రస్తుతం పీకే టీమ్‌ వాటికి కౌంటర్ ఇచ్చే పనిలో పడిందట. యూట్యూబ్‌ ఛానల్‌లో స్టాలిన్‌, ఉదయనిధి, డీఎంకే గురించి రాజకీయ వ్యంగ్య విమర్శలను తొలగించే పనిలో ఉందట ఐపాక్స్.

 

మొత్తమ్మీద.. అనేక పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించిన పీకే టీమ్‌ దక్షిణ భారత దేశంలో మరో పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: