ఎల్‌ఐసీ...! ఇన్సూరెన్స్‌ రంగంలో రారాజు. లాభాలే తప్ప నష్టానికి మీనింగ్‌ తెలియని సంస్థ. అలాంటి సంస్థ నేడు ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తోంది. జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఇండియా పబ్లిక్‌ ఇష్యూకు రాబోతోంది. ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... దేశవ్యాప్త నిరసనలు, సమ్మెకు సిద్ధమైంది ఎల్‌ఐసీ ఇండియా.

 

జీవిత భీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీకి ఊహించని షాక్‌ ఎదురైంది. ప్రభుత్వ రంగంలోని బీమా సంస్థ ఎల్‌ఐసీ ఇండియాను స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ వాటాల కొంత విక్రయం, లోటు పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగా నిధులు సమీకరించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటంచారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. 

 

తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా ఎల్‌ఐసీలో ఉన్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. లిస్టింగ్‌ ద్వారా కంపెనీల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుందని.. సంపద సృష్టిలో రిటైల్‌ ఇన్వెస్టర్లు భాగస్వాములు అవుతారని కేంద్రం ఆలోచన. అయితే ఎంత వాటాను విక్రయించాలనుకుంటుందో మాత్రం ప్రకటించలేదు. 

 

కేంద్రం తీసుకున్న నిర్ణయం పై మండిపడుతున్నాయి ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాలు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు యూనియన్లను అధికారులను సంప్రదించలేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఆలోచన జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని మండిపడుతున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో దోహదపడ్డ ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేయడం కుట్రగా అభివర్ణిస్తున్నారు. 

 

ఇప్పటివరకు లాభాలే తప్ప... నష్టం అంటే ఎంటో కూడా ఎల్‌ఐసీచవిచూడలేదంటున్నారు అధికారులు. ఎల్‌ఐసీ మాత్రమే లాభాల్లో నడవడమే కాకుండా.... నష్టాల్లో ఉన్న సంస్థల షేర్లు సైతం ఎల్‌ఐసీ కొనుగోలు చేసి లాభాల్లోకి తెచ్చేలా ఎల్‌ఐసీ ఇండియా కృషి చేసిందన్నారు. ప్రభుత్వం కార్పొరేట్‌ కబంద హస్తాల్లో కూరుకుపోయిందని... పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలను సైతం కార్పొరేట్‌ వ్యక్తులను అమ్మివేసే కుట్ర జరుగుతోందన్నారు. 

 

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాలు. రేపు దేశవ్యాప్తంగా అన్ని ఎల్‌ఐసీ కార్యాలయాల్లో గంటపాటు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే... నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: