తొందరలోనే హైదరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంచలనం రేపబోతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది వైసిపి వర్గాల నుండి. అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో చంద్రబాబునాయుడు, టిడిపిలోని ప్రముఖులు, బినామీలు భారీ ఎత్తున  కొనుగోలు చేసిన భూముల విషయంలో ఈడి దర్యాప్తుకు రెడీ అవుతోందని సమాచారం. ఇప్పటికే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిఐడి దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే.

 

తన దర్యాప్తులో బయటపడిన సుమారు 800 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు నోటీసులు ఇవ్వటానికి ఈడి రంగం సిద్ధం చేస్తోందట. ఇదే విషయమై సిఐడి దర్యాప్తులో ప్రాధమిక దర్యాప్తు పూర్తయ్యింది. 800 మంది తెల్ల రేషన్ కార్డుదారులు అందులోను తెలంగాణాలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా అమరావతి పరిధిలోని  గ్రామాల్లో లక్షల రూపాయలు పెట్టి భూములు కొనుగోలు చేయటమే అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

 

మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రకారం చంద్రబాబుతో పాటు మంత్రులుగా పనిచేసిన పల్లె రఘునాధరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, యనమల రామకృష్ణుడు వియ్యుంకుడు సుధాకర్ యాదవ్, రావెల కిషోర్ బాబు, నారాయణ, ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్, మాజీ ఎంఎల్ఏ దూళిపాళ నరేంద్ర లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళల్లో చాలామంది తమ ఇళ్ళల్లో పనిచేసే డ్రైవర్లు, వంటవాళ్ళు, పనిమనుషుల పేర్లపై పెద్ద ఎత్తున భూములు కొనేశారు.

 

దాదాపు ఆరుమాసాలు దర్యాప్తు చేసి సిఐడి చాలా విషయాలను బయటపెట్టింది. తమకు రిజిస్ట్రేషన్ల శాఖ నుండి తీసుకన్న డాక్యుమెంట్ల ఆధారంగా  టిడిపి నేతల బినామీల జాబితాను తయారు చేసింది. వారిలో కొందరికి సిఐడినే నోటీసులిచ్చింది. కాకపోతే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండటంతో సిఐడి తో దర్యాప్తు చేయించటం కన్నా ఈడితో దర్యాప్తు చేయించటమే ఉత్తమమని ప్రభుత్వం అనుకున్నది. దాంతో సిఐడి చెన్నైలోని ప్రాంతీయ కార్యాలయానికి లేఖ రాసింది. దాన్ని హైదరాబాద్ లోని అధికారులకు ఫార్వార్డ్ చేయటంతో ఇక్కడి ఈడి అధికారులు తొందరలో రంగంలోకి దిగబోతున్నారు. మరి ఈడి దర్యాప్తు మొదలైతే కానీ కలుగుల్లో దూరుకునున్న ఎలుకలు బయటకు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: