గతంలో పంటల్ని పక్షుల నుంచి కాపాడుకోవడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు వేలెడంత లేని మిడతలు.. రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లక్షల హెక్టార్లలో పంటను నాశనం చేస్తున్నాయి ఈ కీటకాలు. వయా పాకిస్తాన్‌.. ఇప్పుడు భారత్‌లోకీ ప్రవేశించాయి.

 

కరోనా తర్వాత.. ఆ స్థాయిలో ప్రపంచాన్ని బెంబేలిత్తిస్తోన్న అంశం మిడతల దాడి. ఈ కీటకాలు పలు దేశాల్లో లక్షల ఎకరాల పంటల్ని నాశనం చేస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కోట్ల డాలర్లే ఖర్చు చేయాల్సి వస్తోంది. 25ఏళ్లలో కనీవినీ ఎరగని స్థాయిలో దాడి చేస్తున్న ఈ మిడతలతో.. ఆఫ్రికా విలవిల్లాడుతోంది. 

 

ఇప్పటికే భారత్‌లోని రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో 3.5 లక్షల హెక్టార్ల పంటను నాశనం చేసిన ఈ కీటకాలను కట్టడి చేసే పనిలో నిమగ్నమైంది ప్రభుత్వం. 1993 తర్వాత ఈ స్థాయిలో మిడతలు ఎప్పుడూ భారత్‌పై దాడి చేయలేదు. యెమన్‌, సోమాలియా, సూడాన్‌ల నుంచి వయా పాకిస్థాన్‌ ఇవి భారత్‌కు చేరాయి.

 

వాస్తవానికి మానవుల కన్నా ముందే కీటకాలు ఈ ప్రపంచాన్ని ఏలాయి. సొరంగాల నుంచి పర్వత శిఖరాల వరకు అవి వ్యాపించి ఉన్నాయి. వీటిలో కొన్ని మానవాళికి ప్రయోజనకరమైనవి కాగా.. మరికొన్ని మాత్రం ప్రమాదకరమైనవి. వాటిలో అతి నష్టదాయక కీటకాలు మిడతలు. అసలే వానల్లేక పంటలు సరిగ్గా పండని పరిస్థితి. ఇప్పుడు ఈ మిడతలు కూడా తోడై మరింత నష్టం చేస్తున్నాయి. 

 

ప్రధానంగా ఈ మిడతల్లో పది జాతులు ఉండగా.. వాటిలో ఎడారి మిడతది విధ్వంసకరమైన జాతి. ఈ డిజర్ట్‌ లోకస్ట్‌.. ఇప్పుడు చాలా దేశాల్లో రైతులకు, ప్రభుత్వాలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. భారత రైతులను కూడా ఇవే భయపెడుతున్నాయి. ఇటాలియన్‌ లోకస్ట్‌, మోరాకన్‌ లోకస్ట్‌, ఏషియన్‌ మైగ్రేటరీ లోకస్ట్‌లు కాకసస్‌, మధ్య ఆసియా ప్రాంతంలో ఆహార భద్రతకు పెను ముప్పుగా మారాయి. వీటివల్ల లక్షల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: