ఈ ప్రపంచం మీద మానవుడే కింగ్ అనుకుంటాం. వాస్తవానికి మనిషికి ఉన్నన్ని తెలివితేటలు ఇంకా ఏ జీవికీ లేవు. కానీ అలాగని అంతా మనిషి చేతిలోనే ఉందని చెప్పలేం. అందుకు ఉదాహరణే.. ఇప్పుడు ప్రపంచాన్ని వైరస్ లు, కీటకాలు. ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందల సంఖ్యలో ఈ వైరస్ కారణంగా బలయ్యారు. మరికొన్ని వేల మంది మృత్యుముఖంలో ఉన్నారు.

 

మరోవైపు.. కీటకాలు కూడా ప్రపంచాన్ని భయపెడుతున్నాయ్.. అవేంటంటారా.. మిడతలు. ఏంటీ మిడతలు కూడా ఇబ్బంది పెడతాయా అంటారా.. అవును మరి.. ఇప్పుడు ఆఫ్రికా ఖండాన్ని మిడతల దండు వణికిస్తోంది. ప్రత్యేకించి సోమాలియా దేశాన్ని మిడతలు సర్వ నాశనం చేస్తున్నాయి. ప్రస్తుతం మిడతల దండు దాడికి ఆఫ్రికా విలవిలలాడుతోంది. కెన్యా, ఇథియోపియా, సోమాలియా, సూడాన్‌, జిబౌటి, ఎరిట్రియాల్లో ఇవి చెలరేగిపోతున్నాయి.

 

పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. చివరకు సోమాలియాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది కూడా. ఇక కెన్యాలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనిస్థాయిలో మిడతలు రెచ్చిపోతున్నాయ్. ఈ మిడతలను కంట్రోల్ చేయాలంటే.. తక్షణం 50 కోట్ల రూపాయలు అవసరమని యునైటెడ్ నేషన్స్ ప్రకటించే రేంజ్ లో సమస్య ఉంది.

 

మరికొన్ని దేశాలు చిన్నచిన్న విమానాలతో పంట పొలాలపై క్రిమిసంహారక మందులను చల్లుతున్నారు. వీటిని కట్టడి చేయకపోతే.. నాలుగు నెలల్లోనే వీటి సంఖ్య ఏకంగా 500 రెట్లు పెరిగిపోతుందట. అంటే.. పరిస్థితి ఎంత దారుణమో ఊహించుకోండి. ఎక్కడో ఆఫ్రికా కదా మనం సేఫ్ అని అనుకోవడానికి వీళ్లేదు.. ఎందుకంటే.. ఇటీవలే పాకిస్థాన్‌లోనూ ఈ మిడతల దండు పెను నష్టం కలిగించింది. పాక్ లోనూ అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వీటిని కంట్రోల్ చేసేందుకు దాదాపు 700 కోట్లు ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యింది. అంటే వీటి దూకుడు ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: