దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే ఆలోచనలతో ఆప్… ఎలాగైనా హస్తీనాలో పాగా వేసి, దేశం దృష్టిని ఆకర్షించాలని బీజేపీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా పరస్పరం వివాదాస్పద వ్యాఖ్యలతో ఎలక్షన్ హీట్‌ పెంచుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు తీవ్రం చేసింది. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకొని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి కొన‌సాగింపుగా ఆప్ సంచ‌ల‌న స‌వాల్ విసిరింది.

 

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థులు, ఇతర నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఆప్‌ అధినేత, సీఎం కేజ్రీవాల్‌ విరుచుకుప‌డ్డారు.  కేజ్రీవాల్ ఒక అమాయక ముఖం పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అయన చేసే అరాచకాలకు సంబంధించి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నట్లు జవదేకర్ తెలిపారు. కేజ్రీవాల్ ఒక అరాచకవాది, ఉగ్రవాది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

 

ఇక‌, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  ఢిల్లీ సీఎంపై మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కేజ్రీవాల్‌కు పాకిస్తాన్‌ మద్దుతు ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేజ్రీవాల్‌కు అనుకూలంగా పాకిస్థాన్‌ మంత్రి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించిన యోగి… షహాన్‌బాగ్‌ లో సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు కేజ్రీవాల్‌ మద్దతుందని ఆరోపించారు.


అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కామెంట్ల‌కు కౌంట‌ర్ ఇచ్చింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అంటూ కేంద్రమంత్రులు చేస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఎంపీ సంజయ్ తప్పుపట్టారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ఎంపీ సంజయ్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారం, ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఎన్నికల కమిషన్.. కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్, అనురాగ్ ఠాకూర్ పై చర్యలు తీసుకోవాలని ఎంపీ సంజయ్ కోరారు.  కేంద్రప్రభుత్వానికి దమ్ముంటే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: