అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి శాసన మండలి లోని విపక్షాలన్నీ మూకుమ్మడిగా షాక్ ఇచ్చాయి . అసెంబ్లీ ఆమోదం పొందిన పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు లను శాసనమండలి చైర్మన్ షరీఫ్,  సెలెక్ట్ కమిటీ కి పంపాలని నిర్ణయించిన విషయం తెల్సిందే . ఈ మేరకు మండలిలో ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని పక్షాలకు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం సభ్యుల జాబితా ను పంపాల్సిందిగా కోరుతూ ఆయన  లేఖలు రాశారు . అయితే  ఇంతలోనే శాసనమండలి తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర అగ్రహావేశాలను  వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఏకంగా శాసన మండలిని  రద్దు చేయాలని   నిర్ణయించారు .

 

తాను  అనుకున్నదే తడువుగా శాసనసభ సమావేశాలను పొడిగించి మరి,  అసెంబ్లీ లో మండలి రద్దు  బిల్లును  ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు  . అయితే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినప్పటికీ ,  ఉభయసభల్లో కేంద్రం ఈ బిల్లు కు ఒకే చెప్పే వరకు మండలి మనుగడలోనే ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి . అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మండలి చైర్మన్,  సూచనల మేరకు టీడీపీ , బీజేపీ తో సహా పీడీఫ్ కూడా తమ సభ్యుల జాబితా లేఖలను మండలి సచివాలయానికి పంపడం హాట్ టాఫిక్ గా మారింది .

 

దీని ద్వారా మూడు రాజధానుల ఏర్పాటును పరోక్షంగా తాము  వ్యతిరేకిస్తున్నట్లు ఈ మూడు పక్షాలు చెప్పకనే చెప్పాయి . ఇక మండలి లో తొమ్మిది మంది సభ్యులున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా తమ సభ్యుల జాబితా ను కూడా అందజేయాల్సిన పరిస్థితిని ఈ మూడు పక్షాలు కల్పించాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . అయితే మండలిని రద్దు చేసినప్పటికీ , ఇంకా ఉద్దేశ్యపూర్వకంగా కార్యకలాపాలను కొనసాగించడం అంటే రాజ్యాంగ నిబంధనలకు తిలోదకాలు  ఇవ్వడమేనని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: