జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు వరుసగా షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, పవన్‌ ఆలోచనలకు పార్టీ అభిప్రాయలకు వ్యతిరేకంగా పవర్‌ స్టార్‌కు తలనొప్పి తీసుకువస్తుంటే, సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడుతూ పవన్‌కు వరుసగా ఝలక్‌ ఇస్తున్నారు.

 

భారత దేశ రాజకీయాల్లో గ్లామర్‌ రంగం నుంచి పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన వారు చాలా మందే ఉన్నారు. అలా వచ్చిన వారిలో ముఖ్యమంత్రి పదవి లాంటి అత్యున్నత స్థాయి అందుకున్నవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా తెర మీద నాయకులను దేవుళ్లుగా భావించే దక్షిణాదిలో సినీ రంగం నుంచి వచ్చి రాజకీయాలను శాసించిన వారి లిస్ట్ చాలా పెద్దదే. అయితే  అలా అని సినిమాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరు రాజకీయాల్లో సక్సెస్‌ అవుతారన్న గ్యారెంటీ ఏం లేదు.

 

ఇండియన్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ లాంటి వారు కూడా రాజకీయాల్లో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. దక్షిణాది విషయానికి వస్తే టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి ఘోర పరాభవమే ఎదురైంది. అయితే ఆయన తమ్ముడు పవన్‌ మాత్రం ఇంకా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అన్నచిరంజీవి, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత కొంత కాలంగా పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న పవన్‌ 2014లో జనసేన పార్టీని స్థాపించి టీడీపీకి మద్ధతు పలికాడు.

 

ఆ ఎన్నికల్లో పవన్‌ ప్రత్యక్షంగా పోటి చేయకపోవటంతో ఆయన బలం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. పవన్‌ మాత్రం టీడీపీ విజయం వెనకే కాదు, సెంట్రల్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా తానే కారణం అంటూ జబ్బలు చరుచుకున్నాడు. అయితే 2019 ఎన్నికల్లో పవన్‌ అసలు బలమేంటో తెలిసిపోయింది. సొంతంగా బరిలో దిగిన పవన్‌కు అన్ని స్థానాల్లో క్యాండిడేట్‌లు కూడా దొరకలేదు. స్వయంగా రెండు చోట్ల పోటి చేసిన పవన్‌ రెండో చోట్లా ఓటమి పాలు కావటంతో పార్టీ పరిస్థితి అద్వానంగా తయారైంది.

 

ఆ తరువాత కూడా జనసేన పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా జనసేనకు ప్రధానం బలంగా భావించిన జేడీ లక్ష్మీనారాయణ కూడా పవన్‌పై విమర్శలు గుప్పించి జనసేనకు గుడ్‌బై చెప్పాడు. ఇప్పటికే పవన్‌, బీజేపీతో దోస్తీ కట్టడంతో త్వరలో జనసేనను కాషాయదళంలో విలీనం చేస్తాడన్న ప్రచారం కూడా జరగుతోంది. దీంతో పవన్‌ రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అదే సమయంలో పవన్‌ వరుస సినిమాలు ప్రకటించటంతో పవన్‌ అభిమానులు కూడా డైలామాలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: