అడవి తల్లులను గద్దెపై నిలిపే వేడుకకు వేళైంది.. కుంభమేళాను తలపించే తెలంగాణ సంబురం కోసం..భక్తజనవాహినికి స్వాగతం పలికేందుకు సిద్ధమైంది మేడారం. ఈ క్ర‌మంలోనే తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు సర్వం సిద్ధం చేశారు. ఈ మేడారం జాతర.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర. ఇది అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశం లో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు.అధిక సంఖ్య‌లో భ‌క్తులు హాజ‌ర‌వుతారు కాబ‌ట్టే.. ఈ పండ‌గ‌ను తెలంగాణ కుంభ‌మేళా అనిపిలుస్తారు. 

 

ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. అయితే ఏటేటా జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. 

 

ఇలా ఈ మహాజాతరకు 1996లో రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది. అలా గిరిజ‌న దైవాలుగా కొలిచే ఈ వ‌న దేవ‌త‌లు.. నాడు ఇంటింటి ఇల‌వేల్పులుగా మారారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగే ఈ జాతరలో గిరిపుత్రులే పూజారులుగా ఉంటారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పూజాకైంకర్యాలు నిర్వహిస్తారు. రెండేళ్ల‌కొక‌సారి జ‌రిగే మేడారం జ‌త‌ర ఈ ఏడు ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో ముహూర్తం ఫిక్స్ అయిన సంగ‌తి తెలిసిందే.


 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: