తెలుగు రాష్ట్రాల్లో నయా దందా జోరందుకుంది . పిల్లలు లేని తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా సాగిస్తోన్న ఈ దందా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు . అప్పుడే పుట్టిన పిల్లల్ని ఈ ముఠా సభ్యులు , పిల్లలు లేని తల్లిదండ్రులకు విక్రయించి  , సొమ్ము చేసుకుంటున్నారు . ఒకొక్క శిశువు ను  10  నుంచి 15  లక్షల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు . అయితే ఈ ముఠా మాత్రం తల్లిదండ్రులకు 70 వేలనుంచి లక్ష రుపాయలకు లోపే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది .

 

ఈ ముఠా సభ్యులు  ప్రధానంగా  గిరిజన తండాలను , ఆదివాసీ గూడాల్లో   అధిక సంతానం కలిగి ఉన్న తల్లిదండ్రులను  లక్ష్యంగా చేసుకుని డబ్బులు ఎరవేసి వాళ్ళ పిల్లలను దత్తత పేరిట తీసుకుని , ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది . గిరిజన తండాల్లో అధిక సంతానం కలిగి ఉన్న తల్లిదండ్రులు పిల్లలను సాకలేక, దత్తత పేరిట ఆడబిడ్డలను ఇతరులకు కట్టబెట్టడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది . అయితే వారి అమాయకత్వాన్ని ఈ ముఠా సభ్యులు ఆసరాగా చేసుకుని  ఆడబిడ్డలను  దత్తత తీసుకుంటామని చెప్పి , వారిని దత్తత తీసుకుని , అంగట్లో వస్తువు మాదిరిగా లక్షల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు . ఈ ముఠాకు పలు సంతానసాఫల్య కేంద్రాలు సహకరిస్తున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు .

 

సంతానం లేకుండా బాధపడుతున్న తల్లితండ్రులకు దత్తత పేరుతో సంతానసాఫల్య కేంద్రాల నిర్వాహకులు , అక్కడ పనిచేసే సిబ్బంది , ముఠా సభ్యులతో కలిసి లక్షల రూపాయలకు పిల్లల విక్రయానికి పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు . ఈ ముఠాసభ్యులలో తొమ్మిది మంది ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారుగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు . వీరు ఇప్పటికే 14 చిన్నారులను విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది  . శిశువుల విక్రయం పై పూర్తి స్థాయి లో దర్యాప్తు జరుపుతున్నట్లు నగర పోలీసులు వెల్లడించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: