తెలంగాణ కుంభ‌మేళా గా ప్రసిద్ధి గాంచిన  సమ్మక్క - సారక్క జాతర జ‌య‌శంక‌ర్ భూపాల ప‌ల్లి జిల్లాలోని  తాడ్వాయి మండలం లో  ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య రేపటి నుండి ప్రారంభం కానుంది.  దాంతో ఈజాతరకు  వచ్చే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ముమ్మురంగా  ఏర్పాట్లు చేసింది.  దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర గా ఖ్యాతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో  నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996 లో ఈ జాతరను ఆంధ్ర ప్రదేశ్,ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.
 

జాతర సంప్రదాయాల విషయానికి వస్తే.. మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము (బెల్లం )నైవేద్యముగా సమర్పించుకుంటారు. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: