ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్కను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు కోటీ యాభై లక్షల మంది తరలి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచనా వేస్తున్నారు. జంపన్నవాగులో స్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు ఇచ్చారు. గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ట్రాలు, పూలు, పండ్లు, చీరె, సారె, ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

 

మేడారం-తాడ్వాయి, మేడారం-పస్రా, మేడారం-కాల్వపల్లి దారుల్లో అటవీప్రాంతంలో విడిది చేశారు. అటవీప్రాంతం భక్తులతో నిండిపోవడంతో వనంలో జన సందడి నెలకొంది. మేడారం ప్రతీ వీధి భక్తులతో కిటకిటలాడింది.  ఈ స‌మ‌యంలోనే ఇళ్ల స్థ‌లాల ధ‌ర‌లు, అద్దెలు వేలు ల‌క్ష‌ల‌కు చేరాయని ప్ర‌చారం జ‌రుగుతోంది. ల‌క్ష‌లాది సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లిరావ‌డం, ప‌రిమిత సంఖ్య‌లోనే ఇళ్లు ఉండ‌టంతో... అద్దెలు భారీగా పెంచేశార‌ని ప‌లువురు భ‌క్తులు పేర్కొంటున్నారు. సుదూర ప్రాంతం నుంచి వ‌చ్చిన త‌మ‌కు ఈ మొత్తం నిరాశ‌ను క‌లిగిస్తోంద‌ని వాపోయారు.

 

మ‌రోవైపు దుకాణ య‌జ‌మానులు సైతం ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మేడారంలో నాలుగు రోజుల పాటు జ‌రిగే జాత‌ర‌లో చిన్న కొట్టు పెట్టుకునేందుకు అద్దెల ధ‌ర‌లు భారీగా ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు. రూపాయ‌ల 15 నుంచి 50 వేల వ‌ర‌కు అద్దెలు ఉన్నాయని పేర్కొంటూ ఈ భారీ మొత్తం భరించ‌డం, తిరిగి లాభాలు సంపాదించ‌డం త‌మ‌తో అయ్యేలా లేద‌ని వాపోతున్నారు. జాతర సంద‌ర్భంగా కొద్ది మొత్తం సంపాదించాల‌ని అనుకున్నామ‌ని...కానీ ధ‌ర‌లు త‌మ‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని వ్యాపారులు ప‌లువురు మీడియాతో మాట్లాడుతూ త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు.

 

ఇదిలాఉండ‌గా, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ... ‘సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారం జాతర నిర్వహిస్తాం. సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం.    భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. తాడ్వాయి మండల కేంద్రంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్ట్స్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా మంత్రులు ఈ మేర‌కు వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: