ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే సమ్మక్క సారక్కల జాతరనే మేడారం జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర. తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా మేడారం జాతర గుర్తింపును పొందింది. ములుగు జిల్లా నుండి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈ జాతర జరుగుతుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భక్తులతో ఈ గూడెం కిక్కిరిసిపోతుంది. 
 
మేడారం జాతరను దక్షిణ భారతదేశ కుంభమేళా అని కూడా అంటారు. సమ్మక్క సారలమ్మలను మొదట గిరిజనులు మాత్రమే ఆరాధ్య దేవతలుగా పూజించేవారు. కాలక్రమేణా సమ్మక్క సారలమ్మలు నాగరికుల అభిమానాన్ని కూడా చూరగొని మొక్కులందుకుంటూ ఉండటం గమనార్హం. సాధారణంగా హిందువుల దేవాలయాలలో మాంసం, మద్యం, ముంటు, అట్టును దరి చేరనీయరు. 
 
మేడారం జాతరలో మాత్రం మిగతా దేవాలయాలకు బిన్నమైన సాంప్రదాయాలను, సంస్కృతిని, పూజా విధానాలను అనుసరిస్తారు. సమ్మక్క సారలమ్మలు కోడి కూర, బగారా అన్నం లేకపోయినా మందుతో నాలుకను తడపకపోయినా మెచ్చరని భక్తులు నమ్ముతారు. గతంలో ఎన్టీయార్ హయాంలో రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉన్న సమయంలో కూడా ఇక్కడ మద్యాన్ని తెప్పించిన తరువాతే దేవతలు కొండ దిగారంటే ఈ జాతరలో మద్యం ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. 
 
ఈ జాతరలో మద్యం ఏరులైపారుతుంది. కోటి రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు మేడారం జాతరలో జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నాలుగు రోజుల్లో తాత్కాలిక లైసెన్స్ లు దక్కించుకున్న మద్యం వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తుంది. కొన్ని గిరిజన తెగలు 60 రోజులను నెలగా పరిగణించటం వలనే మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ భక్తులు ఎక్కువగా పసుపు కుంకుమలను, బెల్లాన్ని, కొబ్బరికాయలను సమర్పిస్తారు. కొందరు కోడెలను సమ్మక్క సారలమ్మకు కానుకలుగా సమర్పించుకుంటూ ఉంటారు. సంతానం లేనివారు సంతానం కొరకు వరాలను కోరుకుంటూ ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: