ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా పేరు పొందిన సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. లక్షల సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకోవటం కొరకు నెలరోజుల ముందునుండే మేడారంకు తరలివస్తున్నారు. దక్షిణ భారతదేశంలో జరిగే అతిపెద్ద జాతరగా మేడారం జాతర పేరుగాంచింది. నాలుగు రోజుల పాటు మాఘమాసంలో జరిగే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. 
 
ఇప్పటికే 40 లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకోగా మరో 60 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే మేడారం జాతర కోసం ప్రత్యేక బస్సులను నడుపుతుండగా తెలంగాణ పర్యాటక శాఖ మేడారం వెళ్లే భక్తుల కోసం హెలికాఫ్టర్ సర్వీసులను కూడా ప్రారంభించడం గమనార్హం. రైల్వే శాఖ ఇప్పటికే జన్ సాధారణ్ పేరుతో ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంది. 
 
మేడారంలో సమ్మక్క దేవత పూజలను అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు. ఈ జాతరలో పూజలలో చిలకలగుట్టపైకి ఒకే వంశానికి చెందిన గిరిజన పూజారి చేతిలో కుంకుమ భరిణ తీసుకొని వెళతారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు పూజలను నిర్వహిస్తారు. పూజ పూర్తయిన తరువాత చిలకలగుట్ట నుండి పూజారులు సమ్మక్క దేవతను తీసుకొని కిందకు దిగుతారు. 
 
అక్కడ జరిగే పూజల గురించి ఆ గిరిజన పూజారి ఎటువంటి విషయాలు బయటకు చెప్పనందున మేడారం పూజ రహస్యాలు ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయాయి. ఆ రహస్యం ఇప్పటికీ ప్రజలకు ఎవ్వరికీ తెలియదు. పూర్వ కాలంలో సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్లిన మలుపు ప్రాంతంలో మాయమైపోయింది. కోయగూడెం దివిటీలు గాలించగా చెట్టు కింది పుట్ట దగ్గర ఒక కుంకుమ భరిణ కనిపించింది. అంతలో ఆకాశం నుండి ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలని రెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్సవం జరిపిస్తే భక్తుల కోరికలు నెరవేరుస్తానని ఆకాశవాణి వినిపించింది. అప్పటినుండి మేడారం జాతర ప్రారంభమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: