ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాపురం ఉల్లిని ఎక్కువగా పండిస్తారన్న విషయం తెలిసిందే. వైసీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కృష్ణాపురం ఉల్లి పండించే రైతుల సమస్య గురించి లేవనెత్తారు. విజయసాయిరెడ్డి కృష్ణాపురం ఉల్లి ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఉల్లి ఎగుమతులకు అనుమతి ఇవ్వకపోతే నష్టమని వివరించారు. 
 
విదేశాలలో కృష్ణాపురం ఉల్లికి మంచి డిమాండ్ ఉందని చెప్పారు. కేంద్రం విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్ కు సానుకూలంగా స్పందించడం గమనార్హం. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విజయసాయిరెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు స్పందిస్తూ కేపీ ఉల్లి ఎగుమతుల కోసం అనుమతులను ఇస్తామని చెప్పారు. ఒకటి రెండు రోజులలో కృష్ణాపురం ఉల్లి ఎగుమతులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటామని ప్రకటన చేశారు. ఢిల్లీలో మంత్రులు, అధికారులను వైసీపీ ఎంపీలు గతంలోనే కలిసి విదేశాలకు ఎగుమతి చేయటం కోసమే కేపీ ఉల్లిని పండిస్తారని కేపీ ఉల్లికి ఉల్లి ఎగుమతుల నిషేధం నుండి మినహాయింపును ఇవ్వాలని కోరారు. 
 
బీజేపీ పార్టీలోని ముఖ్య నేతలను కలిసి వైసీపీ ఎంపీలు కేపీ ఉల్లి రైతుల సమస్యలను వివరించారు. వైసీపీ పార్టీ ఎంపీల కృషి ఫలితంగా కేంద్రం కేపీ ఉల్లి ఎగుమతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 వేల ఎకరాలలో కేపీ ఉల్లిని రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలలో మరియు ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. రైతులు విదేశాలకు ఎగుమతి చేయటం కోసం మాత్రమే ఈ ఉల్లిని పండిస్తారు. 
 
రైతులు ఎక్కువగా శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇతర దేశాలను కేపీ ఉల్లిని ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ ఉల్లి తక్కువ పరిమాణంలో ఉండటంతో పాటు ఘాటుగా ఉండటం వలన మన దేశంలో ఈ ఉల్లిని ఎవరూ వినియోగించటానికి ఆసక్తి చూపరు. 2019 సెప్టెంబర్ నెల నుండి దేశంలో ఉల్లి ధరలు కిలో 100 రూపాయల నుండి 200 రూపాయలకు చేరుకోవడంతో కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించగా కేపీ ఉల్లి పండించే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వైసీపీ ఎంపీ కృషితో కేపీ ఉల్లిని పండించే రైతుల సమస్యలు తీరాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: