హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. మరి రానున్న వేసవిలో...నగర వాసులకు నీటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు నగరవాసుల అవసరాలకు సరిపోతాయా? లేక ఎప్పటిలాగానే నీటి కష్టాలు తప్పవా? 

 

సమ్మర్ వస్తుందంటే చాలు హైదరాబాద్ ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి రావడం కామన్ అయిపోతోంది. ప్రతీ సంవత్సరం వేలాది రూపాయలు వాటర్ ట్యాంకర్ల కోసం ఖర్చు చేస్తున్న అపార్ట్ మెంట్లు చాలా ఉన్నాయి. ఇక డబ్బులు పెట్టలేని సామాన్యప్రజల బాధలు సరేసరి. అందుకే ఈ సారి నగర వాసులకు ఎలాంటి నీటి కష్టాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

 

గ్రేటర్ హైద్రాబాద్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోని ప్రాంతాలకు రోజూ 2081 మిలియన్ లీటర్ల నీటి ని సరఫరా జరుగుతుంది. అందులో నాగార్జున సాగర్ నుంచి మూడు ఫేజ్ ల ద్వారా  1253 మిలియన్ లీటర్లు... ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలు 762 మిలియన్ లీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి 37 మిలియన్ లీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి 29 మిలియన్ లీటర్లు సరఫరా అవుతున్నాయి. 

 

గత ఏడాది  ఉస్మాన్ సాగర్ లో ఈ టైంకు 1774 అడుగులు నీటి మట్టం ఉండగా ఇప్పుడు అది 1757  కి పరిమితమయింది. హిమాయత్ సాగర్ లో 1748 అడుగులు ఉండగా ఇప్పుడు 1736 దగ్గర ఆగిపోయింది.. ఈ వర్షా కాలం లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి భారీ నీరు రావడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎత్తి పోసిన నీటి ద్వారా రెండు నెలల క్రితం వరకు నీళ్లు ఉన్నాయి..గత ఏడాది ఎల్లంపల్లిలో 480 ఉండగా ఇప్పుడు 477 ఉంది.. అయితే నాగార్జున సాగర్, అక్కంపల్లి లో మాత్రం నీటి మట్టం పెరిగింది.

 

 ఫిబ్రవరి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇక మే నెలలో ఉండే ఎండలకు జలాశయాలు ఖాళీ అవడం ఖాయమని, అప్పుడు నీటి సరఫరా ఎలా చేస్తారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  అధికారులు మాత్రం నీటి ఎద్దడి నివారణ కి సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామంటున్నారు. డివిజన్ల వారిగా బొర్ వెల్స్, చేతి పంపులు పునరుద్ధరణపై దృష్టి పెట్టామంటున్నారు. ఉప్పల్, బహదూర్ పుర, చార్మినార్ ప్రాంతాలలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగున్నప్పటికీ, కూకట్ పల్లి,  కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి , మణి కొండ ఏరియాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ తక్కువ గా ఉంది. దీంతో ఆయా ఏరియాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ప్రతీరోజు 610 మిలియన్ గాలెన్లు అవసరం కాగా, ఇప్పుడు 564 వరకు అందుబాటులో ఉన్నాయి. నీటి కొరత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటూ నీటి వృధాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు అధికారులు. తద్వారా నీటి సమస్య కొంత తగ్గుతుందంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: