గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో నకిలీ నోట్లు కొన్ని ఏరియాలలో ఎక్కువగా చలామణి అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసులు నకిలీ నోట్ల ముఠాలపై దృష్టి పెట్టి రెండు ముఠాలను అరెస్ట్ చేశారు. ఈ రెండు ముఠాల నుండి పోలీసులు మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్ ట్యాప్ లు, 6 ఫోన్లు, కలర్ ప్రింటర్లు, 8.5 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
పోలీసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో నకిలీ నోట్లను తయారు చేస్తున్న భారీ ముఠాలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ ఈ ముఠాలు 500 రూపాయల నోట్లను, 2000 రూపాయల నోట్లను ఎక్కువగా ముద్రిస్తున్నట్టు తెలిపారు. కత్తెర, ఫెవిస్టిక్, పేపర్ బండిల్ లను వీరు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. 
 
సీపీ మాట్లాడుతూ నార్త్ జోన్ పోలీసులు కూడా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పోలీసులు ఈ ముఠాలు జగదీష్ మార్కెట్, అబిడ్స్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నట్టు చెప్పారు. ఆ ఏరియాలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న సమయంలోనే వీరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేసిన వారి నుండి 9.27 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 
 
సంగారెడ్డి నుండి ఈ దందా జరుగుతోందని ఈ ముఠా సభ్యులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 17.77 లక్షల రూపాయలను పోలీసులు ఈ ముఠాల నుండి స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్ల ముఠాలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు సీపీ అభినందనలు తెలిపారు. ప్రత్యేక పద్దతుల ద్వారా దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠా సభ్యులు నోట్లు ఒరిజినల్ లా కనిపించేలా చేస్తున్నారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: