గ‌త కొద్దిరోజులుగా ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇప్పుడు ఇంకో ఊహించని ప‌రిణామంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఇటీవ‌లే టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌తో సెల్పీ దిగిన రోజా తాజాగా...ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. రాయలసీమకు అన్యాయం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ప్రజా కోర్టులో ఓడిపోవాల్సిందే అని విమ‌ర్శించారు. అయితే, ఇలా ఘాటు కామెంట్లు చేసిన రోజా ఆ వ్యాఖ్య‌లు చేసిన కొద్ది సేప‌టికే...తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధులైన స్వామి ఆశ్ర‌మంలో క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న చిన‌జీయ‌ర్ స్వామి.

 

తాడేపల్లి మండలం సీతానగరంలో చిన జీయర్‌ స్వామిజీని రోజా క‌లిశారు.  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డితో పాటుగా రోజా స్వామీజీని ద‌ర్శించుకున్నారు. ఈ విష‌యంలో ఎలాంటి దాప‌రికాలు లేకుండా...త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో ఆమె పోస్ట్ చేశారు. ``శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామిని సీతాన‌గ‌రంలో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి గారు, ఏపీఐఐసీ చైర్మ‌న్, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు క‌లిసి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.`` అని వెల్ల‌డించారు. కాగా, గ‌త కొంత‌కాలంగా రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నుంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో...ఈ ఆశీస్సులు చ‌ర్చ‌కు దారితీశాయి. 

 

కాగా, సుబ్బారెడ్డి పేరుతో మ‌రో ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. పేద మధ్య తరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ విధానాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని ఆయ‌న ఆకాంక్షించారని ప్ర‌క‌ట‌న పేర్కొంది. స్వామీజీ ఆశీస్సులు స్వీకరించిన  సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలని అభిలషించారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలుంటాయన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న వినూత్న విధానాలకు దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని సుబ్బారెడ్డి దంపతులు అన్నారు. వారి ఆకాంక్షలు నెరవేరాలని చిన జీయర్‌ స్వామిజీ ఆశీర్వ‌దించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: