అతి త్వరలో ఏపీలో ‘స్థానిక’ ఎన్నికల సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే.  అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని ఇష్యూ బాగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు మీద పెద్ద చర్చ జరగడం లేదు. కాకపోతే ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంటే..రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. అంతా స్థానిక ఎన్నికలపైనే పడతారు. ఎవరికి ఎక్కడ ఎక్కువ సీట్లు వస్తాయనే చర్చలు చేస్తారు. ఇదే సమయంలో మూడు రాజధానులు, అమరావతి ఇష్యూలు స్థానిక సంస్థ ఎన్నికలని ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే విశ్లేషణలు తెరపైకి వస్తాయి.

 

అయితే ప్రస్తుతం ప్రధాన పార్టీలు రాజధాని అంశంలో మునిగి ఉన్న, ఆ పార్టీలకు సంబంధించిన లోకల్ నేతలు మాత్రం స్థానికంపై దృష్టి పెట్టారు. ఇప్పటి నుంచే గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా స్థానిక లెక్కలపై టీడీపీ, వైసీపీ వాళ్ళు ఆసక్తికర చర్చలు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండటం వల్ల స్థానిక ఎన్నికల్లో కూడా తమకే మెజారిటీ సీట్లు దక్కుతాయని వైసీపీ లోకల్ లీడర్లు భావిస్తున్నారు. ప్రకాశం జెడ్పీ పీఠంతో పాటు ప్రధాన మున్సిపాలిటీలు, జెడ్‌పి‌టి‌సిలు దక్కించుకుంటామని ధీమాగా ఉన్నారు.

 

ఇక టీడీపీ వాళ్ళు మాత్రం వైసీపీకి భిన్నంగా విశ్లేషణలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ఇష్యూ ఉంది కాబట్టి, అమరావతికి దగ్గర ఉండటం వల్ల ప్రకాశం జిల్లా కూడా రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గుంటూరుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. మామూలుగానే మొన్న ఎన్నికల్లో జిల్లాలో పర్చూరు, చీరాల, అద్దంకి, కొండపి సీట్లని గెలుచుకుంది.

 

వీటితో పాటు సంతనూతలపాడు అసెంబ్లీ, బాపట్ల ఎంపీ సీట్లని స్వల్ప మెజారిటీతో ఓడిపోయాం, కాబట్టి ఇప్పుడు ఆ స్థానాల్లో సత్తా చాటే అవకాశముందని, వీలు బట్టి మిగతా నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువ స్థానాలు గెలుచుకుని జగన్‌కు షాక్ ఇస్తామని అంటున్నారు. అటు వైసీపీ ఈ నాలుగు సీట్లలో ఓడిపోయిన మిగతా స్థానాల్లో భారీ మెజారిటీలతో గెలిచింది. కాబట్టి మాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని వైసీపీ వాళ్ళు లెక్కలు కడుతున్నారు. మరి చూడాలి ప్రకాశం జిల్లా జగన్‌కు షాక్ ఇస్తుందో? బాబుకు షాక్ ఇస్తుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: