మేడారం భక్త జన గుడారంగా మారుతోంది. మహాజాతర రేపు ప్రారంభం కానుండటంతో దారులన్నీ మేడారం వైపే కదులుతున్నాయి. దీంతో  ఆ ప్రాంతమంతా సమ్మక్క-సారలమ్మ భక్తులతో కిక్కిరిసిపోయింది. 

 

ఉద్వేగభరితంగా సాగే  సారలమ్మ ఆగమనంలో  జాతర ప్రారంభం కానుండడంతో, మేడారం జనంతో నిండిపోతోంది. జంపన్నవాగు జనసంద్రంగా మారగా, మేడారం పరిసర ప్రాంతాలన్నీ కుటీరాలతో నిండిపోతున్నాయి. మొత్తం ప్రాంతమంతా భక్త జన గుడారంగా మారుతోంది.  ఇప్పటికే 40లక్షల మందికిపైగా అక్కడికి చేరుకొని కుటీరాలు ఏర్పాటు చేసుకున్నట్లు  అధికారులు అంచనాలు వేస్తున్నారు.
కొత్తూరు, కన్నెపల్లి, ఊరట్టం, చిలుకలగుట్ట, రెడ్డిగూడెం ప్రాంతాలు పూర్తిగా కుటీరాలతో నిండిపోయాయి.  

 

సందర్శకుల పుణ్య స్నానాలతో జంపన్న వాగు కిటకిటలాడుతుంది. మేడారంలో చెట్టూ, పుట్టా అని తేడా లేదు. ఎక్కడా కొద్ది స్థలం కనిపిస్తే అక్కడ జనం వాలిపోతున్నారు.  కన్నెపల్లి స్థూపం నుండి మేడారం గద్దెల వద్దకు వచ్చే దారిలో కిలో మీటర్‌కు పైగా గుడారాలు వెలిశాయి.  రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఊరట్టం గ్రామానికి సమీపంలోనూ కుటీరాలతో నింపేశారు. ప్రయివేట్‌ వాహనాల ద్వారా వచ్చే వారిని జంపన్నవాగు దాటి వెళ్లనీయడం లేదు. కొత్తూరు, నార్లపూర్‌ క్రాస్‌తో పాటు అంతగా గుడారాలు నిండిపోతున్నాయి. నార్లాపూర్‌-కొత్తూరు మధ్యలో ఎదుటి లంకవనం జనం సంద్రంగా మారింది. 

 

రేపే మహా ఘట్టానికి తెర లేవనుండడంతో దారులన్నీ మేడారం  వైపే చూస్తూన్నాయి. హైదరాబాద్‌ మొదలుకొని ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, కొత్తగూడ, భద్రాచలం, జగిత్యాల, చతీశ్‌గడ్‌ ప్రాంతాల నుండి భారీగా జనం తరలొస్తున్నారు. ఎడ్లబండ్లపై వచ్చే వారు నాలుగైదు రోజుల ముందే బయలుదేరి ఇప్పటికే మేడారం చేరుకున్నారు. మరికొన్ని జిల్లాల నుండి ప్రత్యేక బస్సుల్లో జనం మేడారంకు పోటెత్తుతున్నారు. ప్రయివేట్‌ వాహనాల్ని పస్రా నుండి నార్లాపూర్‌ మీదుగా.. ఆర్టీసీ బస్సులను తాడ్వాయి మీదుగా పంపిస్తున్నారు.  మొత్తంగా లక్షలాది మంది భక్తుల రాకతో మేడారం మొత్తం కిటకిటలాడుతోంది. కోయగూడాలు, గిరిజన పల్లెలు జనజాతరను తలపిస్తున్నాయి. .

మరింత సమాచారం తెలుసుకోండి: