చైనాలో కరోనా రక్కసి విజృంభిస్తోంది. ఈ వైరస్‌ భారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంతకుముందు రోజులో 20కే పరిమితమైన మరణాల సంఖ్య ఇప్పుడు యాభై దాటిపోయింది.

 

చైనాలో కరోనా వైరస్‌.. జూలు విదులుస్తోంది. అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తూ.. మనుషుల ప్రాణాలను మట్టిలో కలిపిస్తోంది. సోమవారం ఒక్కరోజే.. 64 మంది ఈ వైరస్‌ దాటికి బలైపోయారంటేనే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు కరోనా కోరల్లో చిక్కుకుని చైనాలో ప్రాణాలు వదిలిన వారి సంఖ్య.. 425కి చేరింది. పిలిప్పిన్స్‌లోనూ ఓ వ్యక్తి ఈ వైరస్‌ కాటుకు మృత్యువాత పడ్డాడు. మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 20వేలు దాటిపోయింది.

 

కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా ప్రభుత్వం... మరిన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. దీంతో రాకపోకలు మరింత స్తంభించాయి. సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌..వైరస్‌ను కట్టడి చేసేందుకు కలిసి పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని  హెచ్చరించారు. 

 

మరోవైపు జపాన్‌కు చెందిన క్రూయిజ్‌ షిప్‌లో ఉన్న 3000 మందిలో ఒకరికి వైరస్‌ సంక్రమించినట్లు నిర్ధారించారు. దీంతో నౌకలో ఉన్నవారి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు జపాన్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. కరోనా పంజా విసురుతుండటంతో.. ఇతర దేశాలూ అప్రమత్తమయ్యాయి. చైనా ప్రయాణంపై నిషేధం విధించాయి. చైనాలో ఉన్న విదేశీయులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. 

 

భారత్‌లోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అలర్టయిన భారతప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 15 తర్వాత చైనా దేశస్తులకు భారత్‌వచ్చేందుకు మంజూరు చేసిన వీసాలన్నీ రద్దు చేసింది. ట్విట్టర్‌ వేదికగా చైనాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికే చైనా దేశం నుంచి భారత్‌కు వచ్చే పర్యాటకులకు ఈ వీసాలు రద్దు చేసిన భారత్‌.. ఇప్పుడు ఇతర వీసాలను కూడా రద్దు చేసింది. దేశంలోని రాష్ట్రాలు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా సోకినట్టు అనుమనిస్తున్న వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: