స్నేహితులంటే నమ్మక ద్రోహులన్న ముద్ర పడ్ద ఈ కాలంలో, స్నేహం విలువ తెలిసిన వారున్నారంటే అసలు నమ్మాలనిపించదు.. ఇక చిన్నప్పటి దోస్తులను గుర్తు పెట్టుకునే అంతటి తీరిక కూడా లేదు. అసలు మరచిపోలేని సహాయం చేసిన ఫ్రెండ్స్‌కే జీవితంలో మరపురాని విధంగా పంగనామాలు పెడుతున్న కాలంలో జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్దితుల్లో ప్రాణ స్నేహితుడు మనల్ని కలవడానికి ఇంటికి వస్తున్నాడంటే భయపడే రోజులు మనముందు కదులుతున్నాయి.

 

 

స్నేహం అంటే రెండు అరచేతులతో షేక్ హ్యాండ్ ఇచ్చి బై అని చెప్పి పోయేది కాదు. అర్ధరాత్రి ఆపద వచ్చి తలుపుకొట్టి అది తీరాక ముఖం చాటేసేది కాదు. భగవంతుడు మనిషిని పుట్టిస్తూ అన్ని బందాలను తనకు నచ్చినట్టుగా నిర్ణయిస్తాడు. కానీ స్నేహం అనే ఒక్క బంధాన్ని మాత్రం మనిషి చేతిలోనే పెడతాడు. అతని నిర్ణయానికే వదిలేస్తాడు. ఇక ఈ స్నేహం లోని గొప్పదనాన్ని ఎన్నో విధాలుగా మన దర్శకులు తెరపై ఆవిష్కరించారు. కానీ రజనీకాంత్, జగపతి బాబు నటించిన కధానాయకుడు చిత్రంలో జరిగే స్టోరి ఒక ఇద్దరి స్నేహితుల జీవితంలో జరిగింది.

 

 

నమ్మడానికి అనుమానం కలిగించేలా ఉన్నా, ఇంకా ఈ కాలంలో ఇలాంటి స్నేహితులు ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం అని ఈ మ్యాటర్ చదివాక ఒప్పుకోక తప్పదు.. ఆ వివరాలు తెలుసుకుంటే చీమకుర్తికి చెందిన తాటికొండ వెంకటేశ్వర్లు తన పదిహేనేళ్ల వయస్సులో అంటే 1970 ప్రాంతంలో  నాసిక్ వెళ్లి అక్కడ కుట్టు పనిలో శిక్షణ పొందాడు… ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో అతని ఇంట్లోనే ఉండేవాడు… ఈ క్రమంలో ఆ గురువు కొడుకుతో స్నేహం ఏర్పడ్దది.. అతని పేరు ధనుంజయ్…  అలా ఇద్దరు ప్రాణస్నేహితులుగా మారారు…

 

 

ఇక వెంకటేశ్వర్లు శిక్షణ ముగించుకుని, నాసిక్ వదిలేసి చీమకుర్తికి వచ్చేశాడు… ఆ తర్వాత ఎవరి జీవితం వారిదే… ఎవరి బతుకు బాధలు వాళ్లవే… ఇలా 50 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ తన చిన్ననాటి మిత్రున్ని మాత్రం ధనుంజయ్‌ మరచిపోలేదు. ఇకపోతే ఐఏఎస్ అధికారి అయినా తన కొడుకు ద్వారా ఆ దోస్తు కోసం వేట మొదలుపెట్టాడు. యాభై ఏళ్ల క్రితం సంగతి. తన దగ్గర స్నేహితుడి పేరు తప్ప ఇంకేమీ ఆధారం లేదు. కాని మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా ఆ మనుసుకే పని చెప్పగా చీమకుర్తి అనే పేరు గుర్తు చేసింది.

 

 

ఇంకేం ఉంది కేవలం ఊరుపేరుని పట్టుకుని దర్జీగా పనిచేస్తూన్న తన స్నేహితున్ని కనుగొన్నాడు. కలుసు కున్నాడు.. నిజం ఇదొక అద్భుత ఘట్టం. నిజమైన స్నేహానికి కన్నీళ్లు కూడా,  కన్నీరు పెట్టుకున్న క్షణాలు ఆ ఇద్దరు కలిసినప్పుడు జరిగిన సమయాలు. ఆ భావోద్వేగం మాటలకందని మధుర భావం. ఇప్పుడు చెప్పండి యాభై ఏళ్ల అనంతరం ఓ చిన్ననాటి స్నేహితుడిని వెతుక్కుంటూ రావడం, కలవడంకన్నా మంచి వార్త ఏముంటుంది.. ఇదే కదా జీవితంలో చచ్చేదాక  గుర్తుండిపోయే ఆనంద క్షణాలంటే..

మరింత సమాచారం తెలుసుకోండి: