హైదరాబాద్ ప్రతి కూడలి వద్ద డ్రంకన్ డ్రైవ్ టెస్టు లను పోలీసులు నిర్వహించడం సర్వసాధారణం . అయితే ఇప్పుడు ఈ టెస్టులు కొన్నాళ్ల పాటు నిలిపివేయాలని నగరవాసులు కోరుతున్నారు . దానికి కారణం లేకపోలేదు . చైనా లో నుంచి ప్రపంచ దేశాలకు విస్తరిస్తోన్న కరోనా వైరస్ , డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించే బ్రీత్ ఎన్ లైజర్ల ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు . కరోనా వైరస్ దెబ్బ కు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు .

 

ఎక్కడ వైరస్ సోకుతుందోనని భయాందోళనల మధ్య బిక్కు , బిక్కుమంటూ గడుపుతున్నారు . నల్గురు కలిసిన ప్రతి చోట కరోనా వైరస్ గురించే చర్చించుకుంటున్నారు .  నగరం లో  ఇప్పటికే పలు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి . అయితే పరీక్షల్లో  ఎవరికి   పాజిటివ్ అని తేలకపోవడం తో నగరవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు . అయితే కరోనా  వైరస్ భయం నీడలా వెంటాడుతూనే ఉంది . అయితే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలను అప్రమత్తం చేయడంలో , ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి .

 

ఇప్పటికే పలు అనుమానిత కేసులు నమోదయిన నేపధ్యం లో  ప్రభుత్వం ఎందుకు అవగాహన కార్యక్రమాలను చేపట్టడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది . ఇక వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్న  డ్రంకన్ డ్రైవ్ టెస్టులను కొన్నాళ్లపాటు నిలిపివేయాలని ఒక స్వచ్చంద సంస్థ నగర పోలీస్ కమిషనర్ కు లేఖ కూడా రాసింది . మరి  ఈ విషయమై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి . ప్రజారోగ్యం దృష్ట్యా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిలిపివేస్తారా ?, లేకపోతే యధావిధిగా కొనసాగిస్తారా ?? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .  

మరింత సమాచారం తెలుసుకోండి: