ఐటీ శాఖ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలకు షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ మూడు సంవత్సరాల క్రితం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన గులాబీ కూలి అనే కార్యక్రమానికి సంబంధించిన లెక్కలు చెప్పాలంటీ పలువురు మంత్రులకు, మాజీ మంత్రులకు నోటీసులు జారీ చేసింది. మంత్రులు, మాజీ మంత్రులతో పాటు నోటీసులు అందుకున్న వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సమాచారం. 
 
ఐటీ శాఖ నోటీసులు అందుకున్న వారిలో కేటీఆర్, హరీష్ రావు, మహ్మద్ అలీ, ఈటల ఇతరులు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయటం వలనే ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. దాదాపు మూడు సంవత్సరాల క్రితం టీఆర్‌ఎస్ పార్టీ టీఆర్‌ఎస్ వార్షికోత్సవం సందర్భంగా ప్రగతి నివేదన సభను నిర్వహించింది. గులాబీ కూలి పేరుతో సభకు హాజరయ్యే కార్యకర్తల కొరకు టీఆర్‌ఎస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 
 
టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ కార్యక్రమం ద్వారా ఉత్తుత్తి కూలి పనులు చేసి లక్షల రూపాయలు సంపాదించారని అందువలనే ఐటీ శాఖ నుండి చిక్కులు వచ్చాయని తెలుస్తోంది. గతంలోనే రేవంత్ రెడ్డి గులాబీ కూలి కార్యక్రమం పేరుతో నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేశారు. చట్టాలను ఉల్లంఘించారని ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంస్థలకు, రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు చేశారు. 
 
ఐటీ శాఖ నోటీసులను నేతలకు వేరువేరుగా జారీ చేసినట్లు తెలుస్తోంది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు గులాబీ కూలి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులకు సంపాదించిన డబ్బుకు పొంతనే లేదని తెలుస్తోంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు పనులను చూసి కాకుండా భారీమొత్తంలో ఇచ్చినట్టు ఆరోపణలు వినిపించాయి. ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమానికి నిధులు సేకరించడం వివాదానికి కారణమైంది. ఈ నోటీసుల గురించి టీఆర్‌ఎస్ పార్టీ నేతలు స్పందించాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: