దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఇతర రాష్ట్రాలు కూడా ఆ పథకాలను అమలు చేస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి గొప్పతనం గురించి ఇప్పటికీ ఎంతోమంది వ్యక్తులు ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర అడిషనల్ ఎస్పీ టి వి హనుమంతరావు వైయస్ రాజశేఖర్ రెడ్డి గొప్పతనం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తరువాత హనుమంతరావు కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంది. నిజమేనా...? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్నించగా హనుమంతరావు తాను, తను భార్య రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వచ్చిందని చనిపోదామనే నిర్ణయానికి కూడా వచ్చానని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు సహాయంతో రాజశేఖర్ రెడ్డిని కలిశానని చెప్పారు. 
 
రాజశేఖర్ రెడ్డిని కలిసిన తరువాత నా మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజన్న దొరను పిలిపించి ఇతనికి ఉద్యోగం ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరం లేదని లెటర్ టైప్ చేయించి ఉద్యోగం వచ్చేలా జీవో జారీ చేశారని అన్నారు. ప్రపంచంలో దేవుడు అనేది నమ్మకమని రాజశేఖర్ రెడ్డి గారిలో తాను దేవుడిని చుశానని ఆయన లేకపోతే నేను నా కుటుంబం లేదని రాజశేఖర్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని హనుమంతరావు అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు తనకు పునర్జన్మనిచ్చారని హనుమంతరావు చెప్పారు. 
 
నేనెవరో కూడా రాజశేఖర్ రెడ్డి గారికి తెలియదని కష్టాల్లో ఉన్నానని తెలిసి ఉద్యోగం ఇప్పించారని అన్నారు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఏడుపు రాలేదని రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఏడ్చానని మా కుటుంబం ఉందంటే రాజశేఖర్ రెడ్డే కారణమని హనుమంతరావు అన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన హనుమంతరావు 2009 ఎన్నికలకు హైదరాబాద్ లో సీఐ గా విధులు నిర్వహిస్తున్నారు. 
 
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ పార్టీ పట్ల ఆకర్షితులై ఉద్యోగానికి రాజీనామా చేసి హనుమంతరావు ప్రజారాజ్యంలో చేరి విజయనగరం జిల్లా సాలూరు నుండి ఎమ్మెల్యే టికెట్ పొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజన్నదొర చేతిలో హనుమంతరావు ఓడిపోయారు. ఉద్యోగానికి రాజీనామా చేయడం, ఎన్నికల్లో డబ్బులు అన్నీ ఖర్చయిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో చిరంజీవిని కలిసి రాజశేఖర్ రెడ్డికి చెప్పి తిరిగి తన ఉద్యోగం తనకు వచ్చేలా చేయాలని హనుమంతరావు కోరారు. చిరంజీవి మాత్రం కోర్టుకు వెళ్లండని సలహా ఇవ్వగా హనుమంతరావు మల్లాది విష్ణు సహాయంతో కలిసి రాజశేఖర్ రెడ్డిని కలిసి ఉద్యోగం పొందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: