ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయించిన  విశాఖపట్నంలో ఏమేమి కార్యాలయాలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి తాజాగా చెప్పేశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ  ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సచివాలయం, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు ఉంటాయని తేల్చి చెప్పేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం అంటే సచివాలయం ఎక్కడుంటే దాన్నే రాజధాని అంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఏదో టెక్నికల్ అంశంగా జగన్  విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు కానీ వాస్తవంగా  రాజధాని విశాఖపట్నమే అనటంలో సందేహం లేదు. దాంతో విశాఖపట్నంకు ఏ ఏ కార్యాలయాలు తరలిస్తారనే విషయంలో కాస్త గందరగోళం ఉంది. దాన్ని కూడా జగన్ ఈ రోజు క్లారిఫై చేసేశారు.  అదే సమయంలో  అమరావతి లెజిస్టేటివ్ క్యాపిటల్ గా ఉంటుందని, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్ చేస్తామని గతంలో చెప్పిన మాటనే తాజాగా మరోసారి చెప్పారు.

 

జగన్ చేసిన తాజా ప్రకటనలో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఎందుకు ఎంచుకున్నాడో కూడా స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం మీద బాగా డెవలప్ అయిన నగరం ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం మాత్రమే. అందుకనే బాగా డెవలప్ అయిన విశాఖను రాజధానిగా ఎంచుకుంటే ఆ నగరంపై పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికే డెవలప్ అయిన విశాఖను మరోస్ధాయికి చేరిస్తే సరిపోతుందని జగన్ స్పష్టం చేశారు.

 

చంద్రబాబునాయుడు లాగ జనాలను తాను భ్రమల్లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. జనాలకు గ్రాఫిక్కుల రాజధానిని చూపించి మోసం చేయాల్సిన అవసరం లేదన్నారు. జపాన్ సింగపూర్ లాంటి రాజధానుల కట్టటానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. జనాలకు రాజధానిపై వాస్తవాలు తెలియచేయటంలో భాగంగానే  ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెబుతున్నామన్నారు. మొత్తం మీద రాజధానిగా విశాఖ నగరాన్ని ఎంచుకోవటంలో తనకున్న ప్రాధాన్యతలు ఏమిటో జగన్ మరోసారి స్పష్టంగా చెప్పేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: