ది హిందూ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సమ్మిట్ కు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా తనకు అధికారాలు, బాధ్యతలు ఉంటాయని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుందని జగన్ చెప్పారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన అనుచరులు రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారని చెప్పారు. 
 
అమరావతికి లక్షా 9వేల కోట్లు అవసరమవుతాయని గత రిపోర్టులే చెప్పాయని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిందని చెప్పారు. విశాఖలో రాజధానికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని అమరావతికి ఖర్చు చేసే డబ్బులో కేవలం 10 శాతం విశాఖ కొరకు ఖర్చు చేస్తే పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడగలదు. 
 
విశాఖ మన నగరం, మన ఊరు, మన రాజధాని అని జగన్ చెప్పారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని అన్నారు. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు.విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కొనసాగుతుందని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆలోచించే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నానని జగన్ చెప్పారు. 
 
విశాఖలో సచివాలయం, హెచ్.వో.డీ, ముఖ్యమంత్రి కార్యాలయాలు ఉంటాయని జగన్ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశామని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం నుండి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదని అన్నారు. గ్రాఫిక్స్ లో ఏదీ చూపించాలని అనుకోవటం లేదని నిజాలు మాత్రమే చెబుతానని జగన్ అన్నారు.                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: