ఎదురుకోళ్లు... స‌మ్మక్క సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తున్న క్రమంలో భక్తులు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు. తమ చేతిలోని కోళ్లను ఎగరవేస్తూ మొక్కుకుంటారు. అనంతరం వాటిని తల్లులకు బలిస్తారు. తల్లుల దర్శనం అనంతరం బయటకొస్తున్నప్పుడూ ఎదురుకోళ్లు సమర్పిస్తారు. కోర్కెలు తీరితే మళ్లీ జాతరకు మేక పొట్టేలును బలిస్తామని మొక్కుకుంటారు. ఈ ఆచారం తరతరాలనుండి పరంపరగా వస్తోంది. 

 

దట్టమైన కీకారణ్యపు అడవుల్లో, కొండ కోనల మధ్య అంగ రంగ వైభంగా జరిగే జాతర ఇది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం ఇది.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఇది.. మొత్తంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’గా పేరుగాంచినఇది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’ చూడాలంటే రెండు కళ్ళు చాలవు. ఈ మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో జరుగుతున్న అమోఘమైన, అతి సుందరమైన, హాట్టహాసమైన జాతర ఇది.

 

దాదాపు వెయ్యేళ్ల క్రితం ప్రస్తుతం మేడారం ప్రాంతంలో మేడరాజులు కాకతీయులకు సామంతులుగా రాజ్యం చేస్తుండే వారు. మేడరాజ్యానికి సామంత రాజు పగిడిద్దరాజు. పగిడిద్దరాజు భార్య సమ్మక్క. వారి ముగ్గురి సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. సారలమ్మ భర్త గోవిందరాజు, ఓసారి నాలుగేళ్ల పాటు తీవ్ర కరువు కాటకాలు రావడంతో మేడరాజ్యంలో ప్రజలు పన్నులు కట్టలేకపోయారు. దీంతో సామంతులు కాకతీయులకు కప్పం చెల్లించలేదు. కప్పం చెల్లించడం లేదనే సాకుతో కాకతీయులు మేడరాజులపై యుద్ధానికి దిగారు. పగిడిద్దరాజు జంపన్న, నాగులమ్మ, సారలమ్మ, గోవిందరాజు కాకతీయులు వీరోచిత పోరాటం చేశారు. 

 

కుటుంబ సభ్యులంతా కాకతీయులతో జరిగిన యుద్ధంలో నేలకొరిగారని తెలుసుకున్న సమ్మక్క యుద్ద రంగంలోకి దిగింది. పరాశక్తి అవతారమెత్తింది. కాకతీయుల సైన్యాన్ని దైర్యంగా ఎదుర్కొంది. ఈటలు, బల్లాలతో కాకతీయుల సైన్యాన్ని చీల్చి చెండాడింది. ఇక ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైన్యం ఆమెను వెన్నుపోటు పొడిచింది. అప్పుడామే యుద్ధ భూమి నుంచి వైదొలగి మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టవైపు వెళ్లి అదృశ్యమైంది. అక్కడి నెమలిమినార చెట్టు వద్ద సమ్మక్క కుంకుమ భరణి మాత్రమే దొరికింది. ఎంత వెతికినా సమ్మక్క దొరకలేదు. ఆ కుంకుమ భరిణనే సమ్మక్క గుర్తుగా తెచ్చి దానికి పూజలు చేయడం అప్పటి నుంచి వస్తున్న ఆనవాయితి. 

మరింత సమాచారం తెలుసుకోండి: