మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన ఎంతగా సంచలనమైందో అందరూ చూస్తున్నదే. ఇదే విషయమై  రాజధాని ఎంపిక విషయంలో కేంద్రప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్  స్వయంగా పార్లమెంటులోనే  లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

 

ఇదే విషయాన్ని బిజెపి రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ రాజధానిగా అమరావతి కాదని జగన్ విశాఖపట్నంను మార్చి జీవో జారీ చేస్తే దాన్ని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టంగా చెప్పారు. గతంలో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకుని జీవో ఇచ్చారు కాబట్టి దాన్ని మార్చేందుకు లేదని చెప్పటంలో అర్ధంలేని వాదనంటూ కొట్టిపారేశారు. అప్పుడు చంద్రబాబు జారీ చేసిన జీవోను కేంద్రం ఎలాగ పరిగణలోకి తీసుకుందో రేపే జగన్ జారీ చేసిన కొత్త జీవోను కూడా పరిగణలోకి తీసుకుంటుందన్నారు.

 

రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి శిలాఫలకం వేశారు కాబట్టి మార్చకూడదనే వాదనలో లాజిక్ లేదంటూ కొట్టిపడేశారు.  ఇక అమరావతిని మార్చకూడదంటూ అమరావతి రైతులు ఢిల్లీకి వచ్చినా ఉపయోగం ఉండదని స్పష్టంగా చెప్పేశారు. రాష్ట్రస్ధాయిలోని అంశానికి రైతులు ఢిల్లీకి వచ్చిన పెద్దలను కలిస్తే ఏమవుతుంది ? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీలో ఎవరూ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోరన్న విషయాన్ని తాను ఎప్పటి నుండో క్లారిటి ఇస్తున్న విషయాన్ని జీవిఎల్ గుర్తుచేశారు.

 

రాష్ట్రపరిధిలోని అంశాల్లో జనాలను ఎవరు కూడా తప్పుదోవ పట్టించకూడదనే తాము ఒకే విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్నట్లు ఎంపి చెప్పారు. అయినా కొందరు తమ స్వార్ధం కోసం జనాలను మభ్యపెడుతుంటే ఎవరూ ఏమీ చేయగలిగేదీ ఉండదని జీవిఎల్ చెప్పేశారు. ఎంపి చెప్పిన విషయం బట్టి చూస్తే రైతులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసినా, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తో పాటు ఎవరిని కలిసినా ఉపయోగం లేదని చెప్పకనే చెప్పేశారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: