ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభలో ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి తీసుకుందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నవంబర్ నెల 9వ తేదీన వచ్చిన తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. ఈరోజు ఉదయం కేబినేట్ అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పటానికి ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.       
 
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే ట్రస్టును ఏర్పాటు చేయనున్నట్టు మోదీ తెలిపారు. ఆలయ నిర్మాణ బాధ్యతలను రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్టుకు అప్పగించనున్నట్టు చెప్పారు. రామ మందిర నిర్మాణానికి అవసరమైన ప్లాన్ కూడా ఇప్పటికే సిద్ధమైందని భారీ స్థాయిలో రామ మందిర నిర్మాణాన్ని నిర్మిస్తానని కేబినేట్ అందుకు ఆమోదం తెలిపిందని అన్నారు. 
 
ట్రస్టుకు వివాదాస్పద భూమిని అప్పగిస్తామని మందిరం యొక్క నిర్మాణ వ్యవహారాలన్నింటినీ ట్రస్ట్ చూసుకుంటుందని మోదీ అన్నారు. లోక్ సభలో బీజేపీ పార్టీ సభ్యులంతా రామ మందిరం నిర్మాణం కొరకు ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు ప్రకటన చేయగానే హర్షధ్వానాలు చేశారు. ప్రధాని మోదీ ఢిల్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ ప్రకటన చేయడం గమనార్హం. 
 
మందిర నిర్మాణం కొరకు 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించామని మోదీ అన్నారు. స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకునే హక్కు ట్రస్టుకు ఉంటుందని మోదీ అన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. వివాదాస్పద రామ జన్మ భూమి - బాబ్రీ మసీదు గురించి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: