రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందా? ఇటీవల రెవెన్యూ శాఖపై అనేక ఆరోపణలు రావడంతో, ఆ వ్యవస్థను సమూలంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. ఈనెల 11న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ప్రధాన ఎజెండా కూడా రెవెన్యూ ప్రక్షాళనే అని అధికారవర్గాల సమాచారం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది.

 

అవినీతి ఆరోపణలతో చెడ్డపేరు మూట గట్టుకుంటున్న రెవెన్యూశాఖను మార్చేందుకు అన్ని రకాలుగా కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించటంతో పాటు కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 11న ప్రగతి భవన్ లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కెసీఆర్. రాష్ట్రంలో భారీగా ఐఎఎస్ ల బదిలీల తరువాత ఏర్పాటు చేస్తున్న కలెక్టర్ల సమావేశం కావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

 

అయితే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం అమలు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధ్యయనం చేసిందని రెవెన్యూ వర్గాల సమాచారం. కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ భూ చట్టంగా నామకరణం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పిఓటి, ఇనాం, రక్షిత, కౌలుదారు, భూ ఆక్రమణ, భూ దురాక్రమణ, ఎల్టీఆర్, అసైన్డ్, సర్వే, హద్దులు ప్రభుత్వ భూములు ఇలా ఒక్కో కేటగిరీకి సంబంధించి సమాచారాన్ని ఇప్పటికే కలెక్టర్లు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందచేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

 

అవినీతికి కారణమవుతున్న క్షేత్రస్థాయి రెవెన్యూ వ్యవస్థకు సమూల చికిత్స చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలు, లంచాలకు తావులేకుండా పకడ్భందీగా మ్యుటేషన్లతో పాటు భూ రికార్డుల వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.

 

భూ యాజమాన్య హక్కుల బదిలీ, పాసు పుస్తకాల పంపిణీ దస్త్రాల్లో మార్పు, చేర్పుల సందర్భంగా అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులు, సహాయకుల జోక్యం ఉండడం కారణంగా ఈ దుస్థితి ఉందని భావిస్తోంది. ధరణి పోర్టల్ వేదికగా దస్త్రాల నిర్వహణ ప్రారంభమయ్యాక క్షేత్రస్థాయిలో ఎంత మంది విఆర్ఓ, విఆర్ఏల సేవలు అవసరమో గుర్తించి ఈ వ్యవస్థను రద్దు చేయాలా లేక ఇతర శాఖల్లో విలీనం చేయాలా అనే అంశంపై సర్కారు కసరత్తు చేస్తుందని సమాచారం. 

 

రాష్ట్రంలో భూ దస్త్రాల నవీకరణ అనంతరం 94 శాతానికి పైగా దస్త్రాల్లో స్పష్టత వచ్చినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. దీనినే టైటిల్ గ్యారంటీ చట్టంగా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్‌ ను ప్రవేశ పెట్టాలన్న వాదన కొందరు అధికారుల్లో వినిపిస్తోంది. ఈ రెండింటితో పాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్- 1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: