జగన్ క్యాబినెట్ లో త్వరలో రెండు మంత్రి పదవులు ఖాళీ కాబోతున్నాయి అనే సమాచారంతో ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ కు తాము అత్యంత సన్నిహితులం కాబట్టి తప్పకుండా తమకే మంత్రి పదవి దక్కుతుందని అప్పుడే కొంత మంది హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఇక జగన్ కూడా శాసన మండలి రద్దు కావడంతో ఎమ్మెల్సీల ద్వారా మంత్రి పదవులు పొందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ లతో రాజీనామా చేయించి వారికి వేరే పదవులు అప్పగించాలని చూస్తున్నారు. దీంతో ఈ రెండు స్థానాల్లో ఖాళీ ఏర్పడబోతున్న నేపథ్యంలో జగన్ కు వీర విధేయులుగా ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. 


దీనికి తగ్గట్టుగానే జగన్ కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసి కొత్తగా కొంతమందిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు . మంత్రి గా ఆశలు పెట్టుకున్న వారిలో రోజా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మంత్రి పదవి కోసం ఆమె మొదటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు అవకాశం రాకపోవడంతో ఇప్పుడు ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తే అందులో ఒక స్థానంలో తనకు అవకాశం దొరుకుతుందని రోజా ఆశలు నమ్మకంగా ఉన్నారు. 


 రోజా ఆశిస్తున్నట్టు గానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మంత్రి పదవి పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. నారా లోకేష్ పై విజయం సాధించడమే కాకుండా మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉంటూ ఆ పార్టీ తరఫున గత టిడిపి ప్రభుత్వంపై రాజధాని విషయంలోనూ, సదావర్తి భూముల విషయంలోనూ కోర్టు వరకు వెళ్ళి పోరాటం చేసి టీడీపీని ఇరుకునపెట్టారు.దీనివల్ల వైసిపికూడా బాగానే లబ్ధి పొందింది.


 గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆర్కే గెలిస్తే ఆయనను మంత్రిని చేస్తానని జగన్ కూడా మంగళగిరి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రిపదవులు భర్తీ చేపట్టే అవకాశం ఉండడంతో ఆర్కే వైపే జగన్ మొగ్గు చూపించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు రావడంతో రోజాకు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. ఈ ఇద్దరు ఒకే సామజిక వర్గం కావడం కూడా రోజాకు ఇబ్బందికరంగా మారుతున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: