బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారుతోంది. 2020-21కిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో ఐపీవో ద్వారా ఎల్‌ఐసీలో వాటాలను విక్రయించనున్నట్లు ప్రకటించిన విష యం తెలిసిందే. దీనిపై ఎల్ఐసీ ఉద్యోగులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని టార్గెట్ చేస్తూ...కార్యాచ‌ర‌ణ వెల్ల‌డించారు.

 

 

కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని నిరసిస్తూ... దేశవ్యాప్తంగా లక్షమంది ఉద్యోగులు నిరసన బాటపట్టారు. ఎల్‌ఐసీ ను కేంద్ర ప్రభుత్వం  ప్రైవేట్‌ పరం చేయడం స‌రికాద‌ని మండిప‌డ్డారు. ఆయా కార్యాలయాల‌ ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా  ఉద్యోగులు ప్ర‌తినిధులు మాట్లాడుతూ... దేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్‌ఐసీ వెన్నుముక లాంటిదని అన్నారు. కోట్లలో లాభాలు వస్తున్న కంపెనీలో ప్రైవేట్‌ పెట్టుబడులకు అనుమతివ్వడాన్ని తప్పుపడుతున్నట్లు చెప్పారు.  రూ.32 లక్షల కోట్ల నికర ఆస్థులు కలిగి ఉన్న జీవిత బీమా సంస్థను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతుందని వారు ఆరోపించారు. ఎల్‌ఐసీలో 1.25 లక్షల మంది ఉద్యోగులు,  30 కోట్ల మంది పాలసీ హోల్డ ర్లు అందరూ కలిసి ఈ కుట్రను తిప్పికొట్టాలని ఆయన కోరారు. కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే దేశ రాజధానిలో భారీ ప్రదర్శనతో ఛలో పార్లమెంట్‌ కార్యక్రమానికి పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని కోరారు.

 

ఇదిలాఉండ‌గా, వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఎల్‌ఐసీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. లిస్టింగ్‌కు సంబంధించి స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మార్గదర్శకాలను అనుసరిస్తామని, ఇందుకోసం చట్టసవరణ అవసరమవుతుందని, ఇందుకు సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపనున్నట్లు కుమార్‌ వెల్లడించారు. లిస్టింగ్‌ మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌ తర్వాతనే జరుగనున్నదని చెప్పారు. ఎల్‌ఐసీలో వాటా విక్రయం అంతా పారదర్శకంగా జరుగనున్నదని, ప్రతి ఒక్కరు కొనుగోలు చేసే విధంగా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్‌ వెల్లడించారు. ఎల్‌ఐసీలో ఎంతమేర వాటా విక్రయిస్తారు అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... పది శాతం ఉంటుందని అనుకుంటానని, ఇప్పటికైతే ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: