తెలంగాణ ప్రభుత్వం వద్ద ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)కు ఇరువైపుల భారీ ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉంది. అందులో నుంచి తొలి దశలో ఓ రెండు వందల ఎకరాలను పరిశ్రమ అవసరాల కోసం కేటాయించటానికి సర్కారు సంసిద్ధత వ్యక్తం  చేసినట్లు సమాచారం. మంగళవారం నాడు తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునతో సమావేశం అయి పలు అంశాలతో పాటు ఈ సినీ రంగ సెజ్ అంశాన్ని కూడా చర్చించారు. 

ఇప్పటి వరకూ పరిశ్రమలకు ప్రత్యేక ఆర్ధిక మండళ్ల (ఎస్ ఈజెడ్)నే చూశాం. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు  కూడా అలాంటిది ఒకటి రాబోతోంది. తెలంగాణ సర్కారు ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) భవనం కట్టుకోవటానికే భూమి కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ పరిశ్రమకు తెలంగాణ సర్కారే తొలి దశలో ఓ రెండు వందల ఎకరాల భూమి కేటాయించటానికి ముందు కొచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

తొలి దశ కేటాయింపుల తర్వాత ప్రాజెక్ట్ పురోగతిని బట్టి ఇంకా ఎంత భూమి కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. టాలీవుడ్ పరిశ్రమకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఈ సెజ్ లో కల్పించేలా చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. సహజంగా ఏ పరిశ్రమ పెట్టాలన్నా ఎవరైనా ప్రభుత్వం చుట్టూ తిరగాల్సి ఉంటుంది..కానీ తెలంగాణలో మాత్రం ఓ మంత్రే స్వయంగా సినీ ప్రముఖుల దగ్గరకు వెళ్లి ఈ ప్రాజెక్టు గురించి చర్చించటం విశేషం. అయితే ఈ అంశంపై అప్పుడే సినీ పరిశ్రమలో చర్చ ప్రారంభం అయింది.

పరిశ్రమ మొత్తానికి ఉపయోగపడేది అయితే అందరితో చర్చించి ఉండాల్సింది అని..అలా కాకుండా  ఎక్కువ శాతం పూర్తిగా స్వప్రయోజనాలు మాత్రమే చూసుకునే చిరంజీవి, నాగార్జునలతో మాత్రమే సమావేశం అవటం సరికాదనే వాదన పరిశ్రమ వర్గాల్లో  మొదలైంది. దీనికి కౌంటర్ గా త్వరలో పరిశ్రమ ప్రముఖులతో మరో విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో ఇదే నాగార్జునపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి..తాము అధికారంలోకి వస్తే నాగార్జున చేసిన భూ అక్రమణలను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వమే వారితో చర్చలు జరిపి..సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం భూములు ఇస్తామని ముందుకొస్తోందని ఓ పరిశ్రమ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. ఈ సినిమా సెజ్ వెనక రకరకాల ప్లాన్స్ ఉన్నాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: