నిన్న సాయంత్రం తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు కత్తులు, తుపాకీలతో దాడులు చేసుకున్నారు. హాస్టల్ లో ఉండే విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి వీధి రౌడీల కంటే దారుణంగా కొట్టుకున్నారు. ఎంబీఏ రెండో సంవత్సరం చదివే విద్యార్థుల మధ్య గొడవ జరగటంతో కాలేజ్ క్యాంపస్ లో భయానక వాతావరణం ఏర్పడింది. 
 
ఒక వర్గం విద్యార్థి చేతిలో కత్తులు, మరో వర్గం విద్యార్థి చేతిలో తుపాకీ ఉండటంతో మిగతా విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. కాలేజ్ క్యాంపస్ లో జరిగిన ఈ గొడవలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ వారికి చికిత్స జరుగుతోంది. పోలీసులకు ఈ ఘటన గురించి ఫిర్యాదు అందింది. 
 
పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు జరిపారు. వేటకత్తులు, తుపాకీలు విద్యార్థుల చేతికి ఎలా వచ్చాయని పోలీసులు విచారణ చేస్తున్నారు. కొందరు విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో కాలేజీలో జరిగిన గొడవను రికార్డ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి, గతంలో ఇదే కాలేజీకి చెందిన ఒక విద్యార్థి ముఖేష్ అనే మరో విద్యార్థిని మండలూర్ సమీపంలో కాల్చి చంపాడు. 
 
సోషల్ మీడియాలో ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో జరిగిన గొడవ విపరీతంగా వైరల్ అవుతోంది. విద్యార్థులు ఎందుకు గొడవ పడ్డారనే విషయం మాత్రం బయటకు రావటం లేదు. ఒకే కళాశాలలో తరచుగా ఇలాంటి వివాదాలు చెలరేగుతూ ఉండటం గమనార్హం. చికిత్స తీసుకుంటున్న విద్యార్థులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. నెటిజన్లు కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన గొడవ గురించి తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: