జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో కీల‌క ప్ర‌క‌టన చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకోవ‌డం....దానిపై రాజ‌కీయ పార్టీలు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేయ‌డం, కేంద్రం జోక్యం కోర‌డం... అయితే, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ స‌ర్కారు మాత్రం...తాము జోక్యం చేసుకోబోమ‌ని తేల్చిచెప్ప‌డం...తెలిసిన సంగ‌తే. అయితే, ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈనెల 10వ తేదీ తరవాత అమరావతి పర్యటన ఉంటుంద‌ని తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

జ‌న‌సేనాని టూర్‌కు సంబంధించి ఆ పార్టీ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ``ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని రైతులు, ఆడపడుచులు నిరాహార దీక్షలు, ఆందోళనలు మొదలుపెట్టి 50 రోజులు దాటుతున్నా కించిత్తు కూడా సడలని వారి ఉద్యమ స్ఫూర్తి, శాంతియుత పంథా చూసి తెలుగువారంతా గర్విస్తున్నారు. రాజధాని నిర్మాణానికి నిస్వార్ధంగా 33 వేల ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వానికి సమర్పించి ఇప్పుడు రోడ్డునపడిన రైతన్నకు సర్వదా అండగా ఉంటానని గతంలోనే మాట ఇచ్చాను. ఈ నెల 10వ తేదీ తరవాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తాను. మీ వాణిని మరోసారి దేశం నలుమూలలా వ్యాపించేలా నినదిస్తాను. మీ ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను.`` అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుతో ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌యింది.

 


కాగా,  రాజధానుల వ్యవహారంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నించగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులను రూపొందించుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తూ మీడియా నివేదికలు వచ్చాయని.. లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రివివ‌ర‌ణ ఇస్తూ...రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆ రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. .. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు. గత ప్రభుత్వ జీవో ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతి ఉందని నిత్యానందరాయ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: