షహీన్ బాగ్ నిరసనల్లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆప్ కార్యకర్త అని పోలీసులు తేల్చటంపై వివాదం రేగింది. ఎన్నికల సమయంలో కావాలనే బీజేపీ దిగజారుడు రాజకీయాలకు దిగిందని ఆప్ మండిపడింది. దీనివెనుక బీజేపీ కుట్ర ఉందని, ఈసీకి ఫిర్యాదు చేస్తామంటోంది ఆప్. కాల్పులు జరిపిన కపిల్ గుజ్జర్ ఆప్ సభ్యుడేతై, రెట్టింపు శిక్ష విధించాలని స్పష్టం చేశారు కేజ్రీవాల్‌.

 

షహీన్ బాగ్‌ కాల్పుల ఘటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తికి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్న షహీన్ బాగ్లో నాలుగు రోజుల క్రితం కాల్పులు జరిగాయి.  కపిల్ గుజ్జర్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. అయితే కపిల్ గుజ్జర్ ఆప్ నేత అంటూ ఢిల్లీ పోలీసులు ప్రకటించడం రాజకీయంగా అగ్గి రాజేసింది. కపిల్ ఫోన్ లో లభించిన ఫొటోల ఆధారంగా ఆప్‌ తో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించామని పోలీసులు చెబుతున్నారు.

 

మరోవైపు కాల్పులు జరిపిన వ్యక్తికి ఆప్‌ తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించడంతో ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ దేశ భద్రతతో చెలగాటం ఆడుతున్నారని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. షహీన్ బాగ్‌ ను అడ్డం పెట్టుకుని ఆప్ ఎలాంటి నాటకాలు ఆడుతుందో ఢిల్లీ ఓటర్లకు తెలిసిపోయిందని విమర్శించింది. అయితే ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన ఫోటోలపై ఆప్ ఫైర్ అయ్యింది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తోంది. ఢిల్లీ పోలీసుల ప్రకటన వెనుక పోలీసుల హస్తముందని ఆరోపిస్తోంది. ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేస్తామంటోంది.

 

కపిల్ గుజ్జర్ ఆప్ సభ్యుడంటూ పోలీసులు చేస్తున్న ఆరోపణలను కేజ్రీవాల్‌ ఖండించారు.  కపిల్ గుజ్జర్ ఆమ్‌ఆద్మీ సభ్యుడైతే ఆయనకు రెండింతల శిక్షను విధించాలని కేజ్రీవాల్‌ తేల్చి చెప్పారు. అలాంటి తప్పులకు పదేళ్ల జైలు శిక్ష ఉంటే ఆయనకు ఇరవై ఏళ్ల జైలు శిక్షను విధించండి అన్నారు. 

 

బీజేపీకి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో షహీన్ బాగ్ నిరసనలు, హిందూముస్లీం, పాకిస్థాన్ అంశాలు తప్ప... విమర్శించడానికి ఇతర అంశాలేవీ లేవని మండిపడ్డారు కేజ్రీవాల్. బీజేపీ నేతలు కేజ్రీవాల్ ను ఉగ్రవాదిగా అభివర్ణించడంపై స్పందిస్తూ.... ఏ విధంగా ఉగ్రవాదిగా ముద్ర వేయగలరని నిలదీశారు. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితమిచ్చాననీ, తాను ఢిల్లీ ప్రజలకు పెద్దకొడుకు లాంటివాడినని తెలిపారు. తనను ఉగ్రవాది అని ఢిల్లీ ప్రజలు భావిస్తే ఈవీఎంలపై కమలం గుర్తుకే ఓటేయమని ఓటర్లకు సూచించారు. 

 

మరోవైపు కేజ్రీవాల్‌ ను ఉగ్రవాదులతో పోల్చడంపై ఆయన కుమార్తె హర్షితా కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ నేతలు తన తండ్రిని ఎన్నికల్లో ఎదుర్కొనలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని హర్షితా మండిపడ్డారు. కేజ్రీవాల్ సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారని చెప్పారు. అదే సమయంలో ఢిల్లీ అభివృద్ధికి అక్కడ నివసించే సామాన్యుడి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పనిచేస్తున్నారని వెల్లడించారు. మేనిఫెస్టోలో కూడా అభివృద్ధిపైనే హామీలిచ్చారని గుర్తు చేశారు కేజ్రీవాల్ కుమార్తె హర్షిత. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: