ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారక్క జాతరకు పేరు ఉంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. మేడారం జాతరకు దక్షిణ భారత కుంభమేళాగా కూడా పేరుంది. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా భక్తులు మేడారం జాతరకు హాజరు కాగా మరో 50 లక్షల మంది హాజరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్రం 75 కోట్ల రూపాయల నిధులను మేడారం జాతర కోసం విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేడారం భక్తుల కొరకు ఎన్నో సౌకర్యాలను కల్పించింది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రభుత్వ రంగ సంస్థ బీ.ఎస్.ఎన్.ఎల్ మేడారం వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది. 
 
మేడరం అంతటా హై స్పీడ్ తో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నామని మేడారం జాతరకు వచ్చే భక్తులందరూ ఫ్రీ వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోవాలని బీ.ఎస్.ఎన్.ఎల్ సూచించింది. వైఫై సేవలు ఈరోజు నుండి ఫిబ్రవరి నెల 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని బీ.ఎస్.ఎన్.ఎల్ సంస్థ తెలిపింది. 20 వైఫై హాట్ స్పాట్లను మేడారం జాతరలో అధికారులు జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారు.       
 
మొదటిరోజైన ఈరోజున గోవిందరాజులు, పడిగిద్దరాజు, సారలమ్మ గద్దెలను చేరుకుంటారు. రేపు( ఫిబ్రవరి 6వ తేదీన) సమ్మక్క గద్దెను చేరుతుంది. భక్తులు ఫిబ్రవరి నెల 7వ తేదీన తమ మొక్కులను తీర్చుకుంటారు. దేవతల వన ప్రవేశం ఫిబ్రవరి 8వ తేదీన ఉంటుంది. ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. 1940 సంవత్సరం నుండి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా జరుపుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: