అత్యంత రాక్ష‌సంగా అమాయ‌కులైన బాలిక‌ల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న దుర్మార్గుడి పాపం పండే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్యల కేసులో తీర్పు వెలువ‌డ‌నుంది. వ‌రుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన నల్గొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు… నేడు తీర్పు ఇవ్వనుంది.

 


యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపూర్‌ గ్రామంలో కొద్ది రోజుల వ్యవధిలోనే కనిపించకుండా పోయిన ముగ్గురు అమ్మాయిల మృతదేహాలు… ఊరి శివారులోని ఓ పాడుబడిన బావిలో లభ్యం కావడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులకు… నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. ముగ్గురు బాలికలను రేప్ చేసి దారుణంగా హతమార్చిన శ్రీనివాస్ రెడ్డి ఈ విష‌యాన్ని ఒప్పుకున్నాడు.

 


నల్లగొండ మొదటి అదనపు సెషన్స్‌ కోర్టులోని పోక్సో కోర్టులో ప్రాసిక్యూషన్‌ ముందు వాదనలు వినిపించిన బాధితుల తరుఫు న్యాయవాది.. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడుని అన్నారు. చిన్న పిల్లలపై దారుణంగా వ్యవహరించిన వారిపై జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది అరుదైన కేసుగా పరిగణించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. గతంలోనూ ఒంటరి మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్టు రుజువైందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

 

శ్రీనివాస్ రెడ్డి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించి జూలై 31న న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి ముగ్గురిపై అత్యాచారం చేసి హత్య చేశాడని ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. శ్రీనివాస్ రెడ్డి సెల్ ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, వీడియోలను సేకరించిన పోలీసులు.. హత్య జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను గుర్తించారు. కోర్టులో నేరం నిరూపణ కావడానికి కావలసిన బలమైన సాక్ష్యాధారాలు అన్నిటినీ న్యాయస్థానానికి అందజేశారు. అటు… 300 మంది సాక్షులను పోలీసులు విచారించారు. 2019 డిసెంబర్‌ 28తో పాటు, 2020 జనవరి 6, 7, 8 తేదీల్లో ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ తరఫున కోర్టు వాదనలు విన్నది. 101 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది. కేసులో కీలకమైన డీఎన్ఏ, రక్తపరీక్షలు, పోస్టుమార్టం రిపోర్టు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. కేసుకు సంబంధించిన వాదనలు జనవరిలోనే ముగిశాయి. గత నెలలోనే తీర్పు ఇవ్వాలని భావించినప్పటికీ… వివిధ కారణాల వల్ల ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా పడింది. నేడు తుది తీర్పు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: