హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క స‌మావేశం.... ప్రధాని నరేంద్ర మోదీ మాట‌ల‌పై అప‌న‌మ్మ‌కం వ్య‌క్తం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట‌పై బంజారాహిల్స్‌లోని ఆస్కి ఆడిటోరియంలో ఫిక్కీ, ఆస్కీలు కలిసి ‘2020-21 బడ్జెట్‌ పై విశ్లేషణ’ను నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న నిపుణులు, మేధావులు మాట్లాడుతూ.. బడ్జెట్‌లో కొత్తగా ప్రతిపాదించిన పన్ను విధానంలో వ్యక్తిగతంగా పన్నులు చెల్లించేవారికి పెద్దగా ప్రయోజనం లేకుండా చేశారని అభిప్రాయపడ్డారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణలభ్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.  

 


వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను శనివారం పార్లమెంట్‌లో మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పుడున్న పన్ను విధానాన్ని కొనసాగిస్తూనే.. మరో కొత్త విధానాన్ని ప్రతిపాదించిన సంగతి విదితమే. అయితే ఈ ప్రతిపాదనపై ఐటీ, ఆర్థిక నిపుణుల నుంచి పెదవి విరుపులు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే..హైద‌రాబాద్‌లో ఆస్కి, ఫిక్కీ  నిపుణుల కమిటీ సభ్యులు స‌మావేశం అయ్యారు. భారతదేశంలో అతిపెద్ద లిటిగేటర్‌ ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌గా ఆస్కి, ఫిక్కీ  నిపుణుల కమిటీ సభ్యులు అభివర్ణించారు. ఈ విభాగానికి ప్రతిఏటా టార్గెట్లను నిర్దేశించడం వల్ల లేనిపోని సమస్యల్ని సృష్టిస్తున్నారని తెలిపారు. పన్నులను కట్టనివారిని వదిలేసి పన్నులను సక్రమంగా కట్టేవారి మీద పడుతున్నారని చెప్పారు. ప్రతి సంస్థకో సం ఘం ఉన్నట్లే.. పన్నులు చెల్లించేవారు సంఘంగా ఏర్పడాలన్నారు.పన్ను భయాలను రూపుమాపుతానని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో అన్నారని, కానీ ప్రస్తుతం  అది సాధ్యమయ్యేలా కనబడటం లేదని ఆస్కి, ఫిక్కీ  నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.

 

మ‌రోవైపు, తమ బడ్జెట్ ప్రతిపాదనపై ఆర్థిక‌ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అవసరమైతే కొత్త ఐటీ విధానంపై ప్రభుత్వమే మరింత స్పష్టత ఇస్తుందన్నారు. ``శనివారమే ఈ అంశంపై కొన్ని విషయాల్లో స్పష్టత ఇచ్చాం. ఈరోజు మరిన్ని అనుమానాలను నివృత్తి చేస్తున్నాం. పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను చెల్లింపుదారులు ఎక్కువగా కట్టాల్సి వస్తే.. అసలు ఎందుకీ విధానాన్ని పరిచయం చేస్తాం? అందరికీ కాకపోయినా కొందరికైతే కొత్త పథకం లాభమే`` అని అన్నారు. నూతన విధానంలో ఎలాంటి మినహాయింపులుండవని పునరుద్ఘాటించిన మంత్రి.. కొన్ని మినహాయింపులను కలగలిపే కొత్త పథకాన్ని తెచ్చామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: