పార్లమెంటులో నరేంద్రమోడి చేసిన తాజా ప్రకటన చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి 15 మందితో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు మోడి చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ఎందుకు వివాదం అవుతోందంటే ఈనెల 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు మోడి ఈ ప్రకటన ఎందుకు చేయాల్సొచ్చింది ?

 

ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచేది అనుమానమే అనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఎన్నికల్లో ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఇప్పటి వరకూ ఎన్ని సంస్ధలు ముందస్తు సర్వేలు జరిపినా ఒక్కదానిలో కూడా బిజెపి గెలుస్తుందని రాలేదు. జరిపిన ప్రతి సర్వేలోను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దే గెలుపని స్పష్టమైన సంకేతాలు వచ్చేశాయి. దాంతో గెలుపే లక్ష్యంగా బిజెపి ఎన్ని పావులు కదుపుతున్నా ఫలితం కనబడలేదు.

 

రాముడు మాత్రమే తమను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతో చివరకు వేరేదారి లేక మోడి రామజపాన్ని అందుకున్నారు. ఇందులో భాగంగానే ఆలయ నిర్మాణానికి 15 మందితో ట్రస్టు ఏర్పాటంటూ సెంటిమెంటును మోడి తెరపైకి తెచ్చినట్లున్నారు. మొదటి నుండి కూడా బిజెపి గెలుపంతా కేవలం సెంటిమెంటును రాజేయటంపైనే ఆధారపడున్న విషయం అందరికీ తెలిసిందే.  

 

అదే సమయంలో కేజ్రీవాల్ ఏమో తాను గడచిన ఐదేళ్ళల్లో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమాతో  ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఢిల్లీ ప్రజలకు మంచినీటిని అందించటం, మధ్య, దిగువ తరగతుల టార్గెట్ గా అమలు చేస్తున్న చవకగా అందిస్తున్న వైద్య పరీక్షలు, పాఠశాలల ఆధునీకరణ,  తక్కువ ధరల్లోనే  విద్యుత్ అందించటం లాంటి అనేక పథకాలతో జనాలు కూడా కేజ్రీవాల్ పరిపాలన బాగానే ఉందని అనుకుంటున్నట్లు సర్వేలో తెలుస్తోంది.

 

దానికితోడు కేజ్రీవాల్ గెలిచిన దగ్గర నుండి కూడా మోడి సిఎంను ఎంతగా వేధిస్తున్నది కూడా అందరూ చూస్తున్నదే. దాంతో జనాలు మళ్ళీ కేజ్రీవాల్ కు పట్టం కట్టటం ఖాయమని అర్ధమైంది. అందుకనే సెంటిమెంటును నమ్ముకున్నారు. మరి కేజ్రీవాల్ అభివృద్ధి-సంక్షేమ మంత్రమే ఫలిస్తుందా ? లేకపోతే మోడి సెంటిమెంటే గెలిపిస్తుందా ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: