ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం ఐదు గంటలకు మైకులు మూగబోనున్నాయి. దీంతో ఆఖరి రోజు ప్రచారంలో ప్రధాన పార్టీలకు ,చెందిన స్టార్ క్యాంపెయినర్లు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆప్, బీజేపీల మధ్య ముదిరిన మాటల యుద్ధం, సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నెల 8న పోలింగ్ జరుగనుంది.

 

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నువ్వొకటంటే.....నేను రెండంటా అన్న తీరుగా ప్రచారం సాగింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ కూడా కొన్ని స్థానాల్లో గట్టి పోటీ అందిస్తోంది. సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా షాహిన్ బాగ్‌తో పాటూ, జామియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలతో రాజధానిలో రాజకీయం హాట్ హాట్‌గా మారిపోయింది. దీనికి తోడు ఆమ్ ఆద్మీ, బీజేపీల మధ్య నెలకొన్న మాటల యుద్ధంతో రాజకీయాలు తారాస్థాయికి వెళ్లాయి.

 

అంతర్జాతీయ అబద్దాల పోటీ పెడితే అరవింద్ కేజ్రీవాల్ మొదటి స్థానంలో నిలుస్తారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...ప్రభుత్వ బంగ్లా, కారు తీసుకోలేదని కేజ్రీవాల్ అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాహిన్ బాగ్ ఆందోళనకారులకు మద్దతు తెలిపే వారికి, దేశ భక్తులకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు తమవైపే ఉంటారన్నారు అమిత్ షా.

 

దేశంలోని యువకులకు బీజేపీ దేశభక్తి నేర్పుతుందని, హిందుస్థాన్‌లో ఉండేవాళ్లంతా దేశభక్తులేనని వాళ్లకు తెలియదన్నారు  రాహుల్. దేశ ప్రజల సొమ్మును అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని బీజేపీ విమర్శలు చేశారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య త్వరలోనే మోడీకి పాఠం నేర్పుతుందన్నారు.

 

అటు ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘించిన వారిపై కొరడా ఝలిపిస్తోంది ఎన్నికల సంఘం. షాహిన్ బాగ్ కాల్పుల నిందితుడికి ఆప్‌తో సంబంధాలున్నాయని ప్రెస్ మీట్‌లో చెప్పిన డీసీపీ రాజేష్ డియోకు నోటీసులు జారీ చేసింది ఈసీ. విచారణలో ఉన్న అంశంపై మాట్లాడినందుకు ఆయన్ను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది.

 

బీజేపీ ఎంపీలు పర్వేష్ వర్మ, సంబిత్ పాత్రాలకు కూడా నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. కేజ్రీవాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పర్వేష్ వర్మను 24 గంటల పాటూ ప్రచారానికి దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. షాహిన్ బాగ్‌ ఘటనపై వ్యాఖ్యలు చేసినందుకు సంబిత్ పాత్రాకు నోటీసులు జారీ చేసింది. గురువారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇచ్చేందుకు సమయమిచ్చింది.

 

బీజేపీ, కాంగ్రెస్‌లు ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తుండగా, ఆప్ మాత్రం అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకుంది. గత ఎన్నికల మాదిరిగానే అఖండ విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆప్ నేతలు. ఈ సాయంత్రం ప్రచారం ముగుస్తుండగా, ఈ నెల 8న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లలో నిమగ్నమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: